ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ నెల 13న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన భేటీలో దాదాపు గంటసేపు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి సీసీ టీవీ దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఏపీ ఎన్నికల సంఘం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురి భేటీ రాజకీయంగా దుమారాన్ని రేపింది. ఈ అంశం వైసీపీ నేతలకు అస్త్రంగా మారింది. దీంతో...ఆరోపణలకు దిగారు వైసీపీ నేతలు..

అయితే.. ఈ సమావేశంపై స్పష్టత నిచ్చారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఈ నెల 13న తాను నిమ్మగడ్డ, కామినేనితో రహస్యంగా సమావేశమైనట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. దీనిపై వైసీపీ నేతలు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. లాక్డౌన్ తరువాత తన అధికార, వ్యాపార కార్యకలాపాలను పార్క్ హయత్ హోటల్‌ ‌ నుంచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 13న కామినేని శ్రీనివాస్ తనను కలవడానికి అపాయింట్ మెంట్ తీసుకున్నారని, అదే రోజు రమేశ్ కుమార్ కూడా అపాయింట్‌మెంట్‌ అడిగారన్నారు. ఇద్దరూ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు విషయాలపై తనతో సమావేశమైనట్లు తెలిపారు. తాను రహస్య సమావేశాలు చేయాల్సిన అవసరం లేదన్నారు సుజనా చౌదరి.

మరోవైపు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ సైతం క్లారీటీ ఇచ్చారు. తమ భేటీలో ఎలాంటి రహస్యం లేదని... పబ్లిక్‌గానే హయత్‌హోటల్‌లో కలుసుకున్నామన్నారు. ఎస్‌ఈసీ వివాదంపై పార్టీ అనుమతితోనే నిమ్మగడ్డతో పాటు తాను సుప్రీంకోర్టులో కేసు వేశామని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ వచ్చిన తర్వాత 13వ తేదీ కలిశామన్నారు. తమ భేటీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

అటు సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు సమావేశంపై స్పందించిన ఆయన... ఆ ముగ్గురు కలిస్తే తప్పేంటన్నారు. సుప్రీం ఆదేశాలను కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఫైర్‌ అయ్యారు.సుజనా, కామినేనితో నిమ్మగడ్డ భేటీ అయితే తప్పేంటి?’ ఘాటుగా ప్రశ్నించారు. వారేమైనా అసాంఘిక శక్తులా? నేరస్తులా.. అంటూ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story