కరోనా సమయంలోనూ వైసీపీ కుంభకోణాలు, కక్షసాధింపు గర్హనీయం : చంద్రబాబు

కరోనా సమయంలోనూ వైసీపీ కుంభకోణాలు, కక్షసాధింపు గర్హనీయం : చంద్రబాబు

ఏపీలో జగన్‌ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. కరోనా సమయంలోనూ వైసీపీ కుంభకోణాలు, కక్షసాధింపు గర్హనీయమన్నారాయన. పార్టీ సీనియర్‌ నేతలతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా.... ఇంటింటికి 3 మాస్కులు ఇస్తామని చెప్పి వైసీపీ మోసం చేసిందన్నారు. మాస్కుల తయారీలో స్కాం, కరోనా కిట్ల కొనుగోళ్లలో స్కాం, బ్లీచింగ్‌ కొనుగోళ్లలో కుంభకోణాలు జరిగాయన్నారు. చివరికి అంబులెన్స్‌లలోనూ రూ. 307 కోట్లు అవినీతి చేశారంటూ మండిపడ్డారు చంద్రబాబు. అంబులెన్స్‌ల కాంట్రాక్ట్‌ ఇచ్చిన సంస్థ విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ కాదా? అని ప్రశ్నించారు చంద్రబాబు. ఇక ... సరస్వతీ పవర్‌ జగన్‌ సొంత కంపెనీ కాదా అని ప్రశ్నించారు. నీళ్లు, గనులు ఎలా కేటాయిస్తారని అడిగితే సెక్రటరీతో నోటీసులిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. అవినీతికి పాల్పడిన వాళ్లను వదిలేసి...అవినీతి బయటపెట్టిన వాళ్లకు నోటీసులు ఇవ్వడమేంటని మండిపడ్డారు చంద్రబాబు...

ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు చంద్రబాబు. వైసీపీ అకృత్యాలకు ఇంతకన్నా రుజువు ఏం కావాలన్నారు. వైసీపీ ఎంపీ ప్రాణాలకే భద్రత లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు హానీ ఉందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గతంలోనే లేఖ రాశారని గుర్తుచేశారు. దీన్ని బట్టి చూస్తే... వైసీపీ ఎంత భయోత్పాతం సృష్టిస్తోందో అర్థం అవుతుందన్నారు. నందిగామలో కృష్ణ అనే యువకుడి అరెస్ట్‌, విశాఖలో 70 ఏళ్ల కిషోర్‌ను అరెస్ట్‌పై మండిపడ్డారు. గుంటూరులో 66 ఏళ్ల రంగనాయకమ్మపైనా తప్పుడు కేసు పెట్టి వేధించారన్నారు. చివరికి వృద్ధులను కూడా వైసీపీ నేతలు వదలడం లేదంటూ మండిపడ్డారు చంద్రబాబు.

అటు 'టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సైతం... జగన్ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. టీడీపీ సానుభూతిపరులు నందకిషోర్, కృష్ణ అరెస్ట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడిన లోకేష్‌.. ఈసారి కాస్త డిఫరెంట్‌గా పోస్ట్‌ పెట్టాడు. తన మామ.. బాలయ్య పవర్‌ఫుల్‌ సినిమా... సింహా డైలాగ్‌ తరహాలో లోకేష్‌ ట్వీట్‌ చేశారు. వైసీపీ మాఫియా ఇసుక కొట్టేస్తే నో సీఐడి...., ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సీఐడి...., ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సిఐడి...., విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు J-ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సిఐడి.... అంటూ సింహాలో తన మామ బాలయ్య స్టైల్‌ను ఫాలో అవుతూ ట్వీట్‌ చేశారు లోకేష్. 108లో స్కామ్ బయటపడితే నో సిఐడి....., మైన్స్ మింగేస్తుంటే నో సిఐడి.. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి... ప్రభుత్వ తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌ని సీఎం జగన్‌..... సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్‌గా మార్చేశారంటూ ఫైర్‌ అయ్యారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?. ఏం నేరం చేసారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. కృష్ణ, కిషోర్‌కు పార్టీ అండగా ఉంటుందన్నారు. సీఎం జగన్ పాలన గురించి వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు. మరి వారిని సీఐడి అరెస్ట్ చేస్తుందా?’’ అంటూ ప్రశ్నించారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story