దేశ భక్తి.. చిత్ర దర్శకుడు చైనా వస్తువులకు నిప్పు..

ఒంటరిగా మనిషే మనుగడ సాగించలేడు. ఇంక దేశాలు ఎలా సాగిస్తాయి. మన సైన్యాన్ని మట్టుపెట్టిందన్న భావోద్వేగంతో చైనా వస్తువులు బ్యాన్ చేయాలంటున్నారు కానీ చైనా వస్తువులతో మన జీవితాలు మమేకమైపోయాయి. మనం వాడుతున్న సగం వస్తువులు చైనావే అని మర్చిపోతున్నాం. తాజాగా తమిళ చిత్ర దర్శకుడు శక్తి చిదంబరం తన ఇంటిలోని చైనా వస్తువులన్నీ కుప్పగా పోసి నిప్పంటించారు.

ఇటీవల చైనా దాడిలో భారత సైనికులు 20 మంది మృతి చెందడంతో చిత్ర రంగ ప్రముఖులు చైనా వస్తువులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నటి సాక్షి అగర్వాల్ చైనా ఉత్పత్తులను ఇకపై కొనేది లేదని ప్రకటించింది. మొన్నటి వరకు టిక్ టాక్ లో గడిపిన ఆమె అకౌంట్ కూడా రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చార్లీ చాప్లిన్, కోవై బ్రదర్స్, ఇంగ్లీష్ కారన్, మగానడిగన్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన శక్తి చిదంబరం మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉన్న చైనా వస్తువులు టేప్ రికార్డర్, సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కుప్పగా పోసి నిప్పంటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దులో చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడి భారత సైనికులను హతమార్చడం హేయమైన చర్య అని అన్నారు. చైనాపై ఆర్థిక నిషేధం విధించాలని, ఇకపై దేశంలో చైనా ఉత్పత్తులను ఎవరూ వాడకుండా జాతీయతా భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇకపై తాను చైనా వస్తువులను కొనేది లేదని తేల్చి చెప్పారు.

Recommended For You