పోలవరానికి క్లీన్ చిట్.. అవినీతి జరగలేదు : కేంద్ర జలశక్తి శాఖ

పోలవరానికి కేంద్రం క్లిన్ చిట్ ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఇది అప్పటి అధికార పార్టీ టీడీపీకి మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎంతో ఊరటనిచ్చేదే. గత ప్రభుత్వ హయాంలో అవినీతిపై విచారణ జరపాలంటూ సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హోకోర్టులో వేసిన పిటిషన్ కు జలశక్తి శాఖ రిప్లై ఇచ్చిన సందర్బంగా ప్రతి అంశంపై వివరణ ఇచ్చింది. అయితే పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

అయితే అధికారం చేపట్టి ఏడాది అయినా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేకపోయింది. కానీ అక్రమాలు జరిగాయన్న విమర్శలను మాత్రం కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు ఈ వాదన తప్పని, ప్రాజెక్టు నిర్మాణం ఎలాంటి ఉల్లంఘనలు, అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి శాఖా స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 2020 జనవరిలో రాష్ట్రప్రభుత్వం రాసిన ఇమెయిల్ లో రైతులందరికీ చట్టప్రకారం పరిహారం చెల్లించాలని పేర్కొన్న విషయాన్నీ గుర్తుచేసింది జలశక్తి శాఖ. డంపింగ్ యార్డు కొరకు నిబంధనల ప్రకారమే పరిహారం చెల్లించామని ప్రభుత్వమే పేర్కొందని తెలిపింది.

Recommended For You