కరోనా కాఠిన్యం.. అప్పటి వరకు నాన్నతో మాట్లాడి.. అంతలోనే..

కరోనా కాఠిన్యం.. అప్పటి వరకు నాన్నతో మాట్లాడి.. అంతలోనే..

తండ్రి ఆస్పత్రి ఆవరణలోనే ఉన్నాడు. కొడుకు ఆస్సత్రి బెడ్ పై కరోనాతో పోరాడుతున్నాడు. అర్థరాత్రి 12 గంటలప్పుడు నాన్నకు సెల్ఫీ వీడియో పంపించాడు. అంతలోనే కన్ను మూశాడు. నాన్నా నాకు ఊపిరి ఆడట్లేదు.. నా గుండె ఆగిపోతున్నట్లుంది. బై డాడీ బై.. అందరికీ బై అని చివరి మాటలు తండ్రి తో చెప్పి వెళ్లి పోయాడు. అలసి పోయిన గుండె ఆగిపోయింది. జవహార్ నగర్ లో నివసిస్తున్న వడ్లకొండ రవికుమార్ (34)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్ల పాటు సౌదీలో పని చేసి రెండేళ్ల క్రితం ఇండియాకు తిరిగి వచ్చాడు. గత కొంత కాలంగా సొంత ఇల్లు నిర్మించుకునే నిమిత్తం ఆ పనుల్లో ఉన్నాడు.

ఈ నెల 23 నుంచి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని తండ్రిని తీసుకుని ఆస్పత్రికని బయల్దేరాడు. ఏ ఒక్కరూ జాయిన్ చేసుకోలేదు. నగరంలోని దాదాపు 11 ఆస్పత్రులు తిరిగారు తండ్రీ కొడుకులు. ఎందుకైనా మంచిదని 24 సాయింత్రం ఓ ప్రైవేట్ ల్యాబ్ లో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అదే రోజు రాత్రి శ్వాస మరింత కష్టంగా మారింది. తండ్రిని తీసుకుని నిమ్స్ ఆస్పత్రికి వెళితే ఎర్రగడ్డ ఛాతి వైద్యశాలకు వెళ్లమన్నారు. అక్కడ జాయిన్ చేసుకుని వైద్యం మొదలు పెట్టారు. వైద్య సిబ్బంది అతడికి ఆక్సిజన్ అమర్చారు. 26వ తేదీ వైద్యులు అతడికి వెంటిలేటర్ తొలగించారని, ఊపిరి ఆడట్లేదని బతిమాలినా పెట్టలేదని తండ్రికి ఆరోజు రాత్రి 12.30 సమయంలో సెల్ఫీ వీడియో తీసి పంపించాడు. ఆ సమయంలో తండ్రికి నిద్ర పట్టిందేమో. కొడుకు పంపించిన వీడియో చూసుకోలేదు. 2.30 అప్పుడు మెలకువ రావడంతో ఫోన్ చూసుకున్నాడు.

కొడుకు పంపించిన వీడియో చూసి బావురుమన్నాడు. పరుగున లోపలికి వెళ్లి చూశాడు. అప్పటికే మృత్యువుతో పోరాడి రవికుమార్ మరణించాడు. కొడుకు మృతదేహాన్ని తీసుకువచ్చి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి 30 మంది హాజరయ్యారు. దీంతో అధికారులు వారందరిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. రవికుమార్ ఇంటి సభ్యులను హోం క్వారంటైన్ చేశారు అధికారులు. డాక్టర్ల నిర్లక్ష్యమే తన కొడుకు ప్రాణాలు తీసిందని తండ్రి ఆరోపిస్తున్నాడు. కానీ రవికుమార్ కు చికిత్స సరిగానే అందించామని, ఆక్సిజన్ అమర్చామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు. మయోకార్డెటిస్ అనే సమస్యతో అతను మృతి చెందాడని వివరించారు. కరోనా సోకిన యువతలో కొందరికి ఈ సమస్య వస్తోందని చెప్పారు. తమ చికిత్సలో ఎక్కడా లోపం లేదని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story