పెళ్లయిన రెండ్రోజులకే కరోనాతో మృతి.. 95 మంది అతిథులకు పాజిటివ్

కరోనా లక్షణాలున్నా లక్ష్యపెట్టక పెళ్లి చేసుకున్నాడు చదువుకుని ఉద్యోగం చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్. పెళ్లైన రెండ్రోజులకే ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మరణించాడు. పెళ్లికి హాజరైన బంధువులు 95 మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషాద ఘటన బిహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురుగ్రామ్ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోకుండా పెళ్లి పీటలు ఎక్కాడు. జూన్ 15న అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. వేడుక జరిగిన రెండు రోజులకే పెళ్లి కొడుకు ఆరోగ్యం క్షీణించింది. బంధువులు హుటాహుటిన పట్నాలోని ఎయిమ్స్ తీస్కెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రికి వెళ్లే దారిలోనే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషయం అధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచి వరుడి దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం విషయం తెలుసుకున్న జిల్లా ప్రభుత్వ అధికారులు వివాహానికి హాజరైన దగ్గరి బంధువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో పెళ్లికి వచ్చిన అతిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 85 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహ శుభకార్యాలకు 50మందినే ఆహ్వానించలని సర్కారు రూల్ పెట్టినప్పటికీ వినకుండా ఎక్కువ మంది బంధువులను ఆహ్వానిస్తున్నారు. కరోనా బారిన పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలు కేసులు రావడం ఇదే మొదటి సారి అని అధికారులు పేర్కొన్నారు.

Recommended For You