మ్యారేజ్ బ్యూరో మోసం.. రూ.15 కోట్లు కొల్లగొట్టి..

మా మ్యాట్రిమోనీ బ్రహ్మాండంగా నడుస్తోంది. ఇందులో మీరు కూడా సుమారుగా ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి నెలకు 5వేలు వడ్డీ ఇస్తా.. ఏడాది చివర్లో అసలు మొత్తం ఇచ్చేస్తా.. అని మెత్తగా మాయమాటలు చెప్పి అందర్నీ బుట్టలో వేసుకున్నాడు. అలా రూ. 15 కోట్లు సంపాదించి పత్తా లేకుండా పోయాడు. టోలీచౌకీలో ఉండే షేక్ మహమూద్ మూడేళ్ల కిందట అల్ మదీనా మ్యారేజ్ బ్యూరో ప్రారంభించాడు. అది బాగా క్లిక్ అయింది. దీంతో మరో బ్రాంచ్ ఓపెన్ చేశాడు. దాని పేరు అల్ సునత్ మ్యారేజ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. రాష్ట్ర వ్యాప్తంగా శాఖలను విస్తరింపజేశాడు.

బ్రహ్మాండమైన లాభాలు ఆర్జించాడు. అయినా ఆశ చావలేదు. ఇంకా ఎక్కువ సంపాదించాలనే వక్రమార్గాన్ని ఎంచుకున్నాడు. తమ మ్యారేజ్ బ్యూరోలో పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన లాభాలు వస్తాయని ప్రకటనలిచ్చాడు. లక్ష పెడితే నెలకు 5 వేలు లాభం ఇస్తానన్నాడు. అన్నమాట ప్రకారం పెట్టుబడి పెట్టిన వాళ్లకి కొన్ని నెలలు బాగానే చెల్లించాడు. మదుపరులు బాగా పెరగడంతో వాళ్లందరికీ ఈ ఏడాది జనవరి వరకు చెల్లించి ఆపేశాడు.
ఆ తరువాత నుంచి వడ్డీ లేదు అసలూ లేదు. ఈ నెల 11న వెళ్లి చూస్తే మ్యారేజ్ బ్యూరోకి తాళం వేసుంది. బాధితులు మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు.

Recommended For You