గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

గుంటూరు జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారిపై అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు యువకులు గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. యడ్లపాడు మండలం తిమ్మపురం వద్దకు రాగానే గుంటూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి అనంతరం ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ ఇద్దరు కూడా మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారు రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామానికి చెందిన అత్తులూరి బలరాం, నరసరావుపేటలోని పనసతోటకు చెందిన షేక్ ఫిరోజ్ అహ్మద్, శ్రీనివాస్ నగర్ కు చెందిన వింజమూరి హరికృష్ణ, మేడసాని వెంకట శ్రీ చందు అని పోలీసులు తెలిపారు.

Recommended For You