మాస్క్ పెట్టుకోలేదా.. అయితే ఫ్లైట్ ఎక్కడానికి వీల్లేదు..

మాస్క్ పెట్టుకోలేదా.. అయితే ఫ్లైట్ ఎక్కడానికి వీల్లేదు..

కరోనాతో జనాలు చచ్చిపోతున్నారు.. కేసులు పెరిగిపోతున్నాయి. మాస్క్ పెట్టుకోండ్రా బాబు అని నెత్తీ నోరు మొత్తుకుని చెబుతున్నా వినిపించుకోరేం. అలానే దేశాలు కూడా దాటేద్దామని ఫ్లైట్ ఎక్కుదామనుకుంటున్నారా.. అస్సలు కుదరదంటోంది అగ్రరాజ్యం అమెరికా. మరి రోజుకి 50 వేల పాజిటివ్ కేసులు వస్తుంటే ఆందోళన ఎక్కువవుతోంది అధికారుల్లో. ప్రపంచంలోనే కరోనా కేసుల విషయంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా విమానాల్లో ప్రయాణించే వారిపై ఫోకస్ పెట్టింది.

మే, జూన్ నెలలో దేశంలో విమానాల ద్వారా ప్రయాణాలు చేసిన వారి సంఖ్య పెరగడంతో కేసుల సంఖ్య పెరిగి ఉంటుందని ది ట్రాన్స్ పోర్షన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ నివేదిక తెలిపింది. ఇకపై మాస్కులు ధరించే విషయంలో నిబంధనలు కఠినతరం చేయాలనుకుంటోంది. ఎవరైనా మాస్క్ ధరించకపోతే కొంత కాలం పాటు విమానం ఎక్కకుండా నిషేధం విధించాలనుకుంటున్నాయి. ఇక్కడి ప్రముఖ అంతర్జాతీయ విమాన సంస్థలు అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, ఫ్రంటియర్ ఎయిర్ లైన్స్, జెట్ బ్ల్యూ ఎయిర్ లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్, స్పిరిట్ ఎయిర్ లైన్స్, యూనిటెడ్ ఎయిర్ లైన్స్ కొన్ని నిబంధనలు విధిస్తున్నాయి.

ప్రయాణీకులందరూ కచ్చితంగా ముక్కూ, నోరు కవర్ అయ్యేవిధంగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నాయి. తినేటప్పుడు, తాగేటప్పుడు మాత్రమే మాస్క్ తీసి మిగతా సమయమంతా మాస్క్ ధరించే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారికి, రెండేళ్లలోపు చిన్నారులకు మాస్క్ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చారు. మాస్క్ ధరించని కన్సర్వేటివ్ పార్టీ నేతను న్యూయార్క్ లో విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. దీన్ని బట్టి నిబంధనలు ఎంత కఠినతరంగా అమలవుతున్నాయో అర్థమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story