జీవితాలను మెరుగు పరుచుకునే దిశగా 'స్వయం సహాయక' బృందాలు..

జీవితాలను మెరుగు పరుచుకునే దిశగా స్వయం సహాయక బృందాలు..

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. ఎంతకాలం.. కొంచెం మెరుగ్గా బతుకుదాం.. మన బతుకుల్ని మనమే మార్చుకుందాం అనుకున్నారు. ప్రభుత్వ సహాయానికి తోడు కష్టపడి దాచుకున్న ప్రతి పైసాని పెట్టుబడిగా పెట్టారు. నాణ్యమైన పప్పుదినుసులను మార్కెట్ కి అందిస్తూ ఆంత్రప్రెన్యూర్ గా ఎదిగారు. తాము అందించే దినుసులకు ఓ బ్రాండ్ విలువను సంపాదించుకున్నారు. ఓ మంచి రాజకీయ నాయకుడి అండ తోడై ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతున్నారు. తమజీవితాలని మెరుగుపరుచుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.

స్వయం సహాయక బృందాల్లో డబ్బు దాచుకోవడమే కాకుండా వాటిని ఎలా ఉపయోగించాలో కూడా వారికి తెలిసి ఉండాలి. ఏ వ్యాపారం చేసినా అందులో నూటికి నూరుపాళ్లు నాణ్యత ఉండేలా చూసుకుంటే ఆ వ్యాపారానికి తిరుగు వుండదు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి స్వయం సహాయక సంఘాల మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నువిజయవంతంగా నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వారి విజయానికి కారణం.. మొదట ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అందులో చురుగ్గా ఉండే ఓ పదిహేను మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. శ్రీవల్లి ఫుడ్ ప్రాసెసింగ్ జేఎల్జీ మిట్టపల్లి పేరుతో రిజిస్టర్ చేసుకున్నారు. ఒక్కొక్కరు రూ.20 వేలు వేసుకున్నారు. బ్యాంకు ద్వారా రూ.10 లక్షలు రుణం తీసుకుని యంత్రాలు కొనుగోలు చేశారు. ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభించారు. కంది,శనగ, మినుము, పెసర.. తదితర నాణ్యమైన పప్పులను సిద్ధం చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. నాణ్యతకు ఢోకాలేక పోవడంతో మిట్టపల్లి పప్పులకు బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. దీంతో వారి వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. సిద్ధిపేట రైతు బజార్లో ప్రత్యేకంగా ఓ స్టాల్ ను ఏర్పాటు చేయాలని భావించారు. బుధవారం నుంచి ఆ యూనిట్ కూడా ప్రారంభమైంది.

పప్పులు ప్రాసెసింగ్ చేసే విధానం.. కొనుగోలు చేసిన కందులను 12 శాతం తేమ వచ్చే వరకు ఆరబెట్టి శుభ్రం చేస్తారు. తర్వాత మెషీన్ లో వేయగానే మీడియం, తాలు, మట్టిగా విడిపోతాయి. తర్వాత మళ్లీ బాయిలర్ కు వేస్తారు. యంత్రాల సాయంతో ఒకేసారి 7 క్వింటాళ్ల కందులను బట్టీ పెట్టవచ్చు. బాయిలర్ చేసిన తర్వాత ఆరబెట్టి గోనె సంచుల్లో నింపుతారు. తర్వాత రోలింగ్ మెషీన్ లో పోస్తారు. బయటకు వచ్చిన తరువాత వాటికి ఆయిల్ రుద్ది పొట్టు తొలగిస్తారు. మళ్లీ సుమారు 18 గంటలు ఆరబెడతారు. మళ్లీ మెషీన్ లో పోయగానే పప్పుగా మారి బయటకు వస్తుంది. చివరిగా నాణ్యమైన పప్పును ప్యాకింగ్ చేస్తారు. క్వింటాల్ కందుల నుంచి సరాసరి 75 కిలోల పప్పు తీస్తారు. బ్యాంకులు ఇచ్చే రుణాలకు తోడు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారం తోడవడంతో మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి ఇంది ఒక మంచి అవకాశం.

Tags

Read MoreRead Less
Next Story