నాన్నా అమ్మ ఎప్పుడొస్తుంది.. ముగ్గురు పిల్లలు రోజూ తండ్రిని..

ఆకలేస్తే అమ్మ.. అలిగితే అమ్మ.. ముగ్గురూ కలిసి చేసే అల్లరిని భరించే అమ్మ.. అక్కడే ఉండి పోయింది ఎందుకు.. ఆ చిన్నారులకు తెలియదు.. నాన్నకి వంట చేయడం తెలుసుకాని.. ముగ్గురు పిల్లలను అమ్మంత సౌమ్యంగా సముదాయించడం తెలియదు.. వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ లోని మీర్పూర్ ఖాస్ లో ఉన్న తన అత్తగారిని చూడటానికి ఫిబ్రవరిలో లీలారామ్ (34) తన ముగ్గురు పిల్లలు, భార్యని తీసుకుని వెళ్లాడు. ఇంటి నుండి బయలుదేరినప్పుడు అతను తన భార్యను పాకిస్థాన్ లోని విడిచిపెట్టాల్సి వస్తుందని ఊహించలేదు. భారతదేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు మార్చి 22 నుంచి లాక్డౌన్ విధించడంతో లీలారామ్ కుటుంబం పాకిస్తాన్ లోనే చిక్కుకుపోయింది. ఇరువైపులా లాక్ డౌన్ తో ఇరుక్కు పోయిన వారిని స్వదేశానికి రప్పించడానికి భారత్, పాకిస్తాన్ అంగీకరించిన తరువాత, అధికారులు లీలారామ్ మరియు అతని ముగ్గురు పిల్లలను తిరిగి రావడానికి అనుమతిచ్చారు.

అయితే, భారతీయ పౌరసత్వం లేదని అతని భార్య జంతా (33) కు అనుమతి లభించ లేదు. కుటుంబం గత వారం జంతా లేకుండానే ఇండియాకు తిరిగి వచ్చింది. నేను ఎంత ప్రయత్నించినా ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయం ఆమెకు తిరిగి రావడానికి అనుమతి ఇవ్వలేదు. నేను ఒక్కడినే నా పిల్లలతో భారతదేశానికి తిరిగి రావలసి వచ్చింది. నా భార్యను అక్కడే వదిలివేయవలసి వచ్చింది అని లీలారామ్ చెప్పారు.

లీలారామ్ 1986 లో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చాడు. ఇక్కడి పౌరసత్వాన్ని కూడా పొందాడు. అతను 12 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ లోనే వుంటున్న హిందూ కుంటుంబంలోని జంతను వివాహం చేసుకున్నాడు. జంత భారతదేశంలో దీర్ఘకాలిక వీసా (ఎల్‌టివి) లో నివసిస్తోంది. నో అబ్జెక్షన్ టు రిటర్న్ టు ఇండియా (నోరి) వీసాపై ఆమె, భర్త పిల్లలతో కలిసి 60 రోజుల పాటు తల్లిని చూడటానికి వెళ్లి అక్కడే ఉండిపోవలసి వచ్చింది.

కుటుంబ వీసాల గడువు ముగిసిన తరువాత, ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం లీలారామ్ మరియు అతని పిల్లలకు మాత్రమే పొడిగింపు ఇచ్చింది. భారత పౌరసత్వం కోసం జంత దరఖాస్తు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉందని లీలారామ్ తెలిపారు. భార్య జంత పౌరసత్వం కోసం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేశాడు లీలారామ్. కాని అర్హత ఉన్నప్పటికీ, ఆమెకు ఇంకా పౌరసత్వం ఇవ్వలేదని లీలారామ్ ఆవేదన చెందుతున్నాడు. పాకిస్తాన్ నుండి హిందూ వలసదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సీమంత్ లోక్ సాంగ్తాన్ అనే సంస్థ ఇప్పుడు జంత కేసును ప్రభుత్వంతో సంప్రదించి సత్వర న్యాయం జరిగేలా చూడాలనుకుంటోంది.

Recommended For You