ఐశ్వర్య , ఆరాధ్యకు కరోనా నెగిటివ్

ఇటీవల కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ డిశ్చార్జ్ అయ్యారు. ఆమెతోపాటు కూతరు ఆరాధ్య కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరిద్దరికి సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చింది. దాంతో నానావతి ఆసుపత్రి వైద్యులు వారిని డిశ్చార్జ్ కావచ్చని సూచించారు. భార్యా, కూతురు డిశ్చార్జ్ అయిన విషయాన్నీ అభిషేక్ బచ్చన్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. అయితే, తాను, తన తండ్రి అమితాబ్ బచ్చన్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నామని తెలిపారు. ‘మాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అందరికీ రుణపడి ఉంటాను. ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ఆసుపత్రి నుంచి వారు డిశ్చార్జ్ అయ్యారు’.. అంటూ అభిషేక్ బచ్చన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

జూలై 11న అమితాబ్ అలాగే ఆయన కుమారుడు అభిషేక్ కు కరోనా నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆ తరువాత రోజు ఐశ్వర్య, ఆరాధ్యకు తేలికపాటి లక్షణాలు వచ్చాయి.. దాంతో వారికి జూలై 12 న కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అమితాబ్ కుటుంబంలో మొత్తం నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స లో ఉన్న అమితాబ్ తన సోషల్ మీడియా ద్వారా క్రమం తప్పకుండా విశేషాలను పంచుకుంటున్నారు. దీంతో ఆయన క్షేమంగానే ఉన్నారన్న విషయం అర్ధమవుతోంది. ఈ సందర్బంగా అమితాబ్ శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు, కఠినమైన సమయాల్లో తనకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల అభిషేక్, ఐశ్వర్య మరియు ఆరాధ్యలతో కూడిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Recommended For You