అయినవాళ్లు ఆన్‌లైన్‌లో అంత్యక్రియలు చూస్తే.. కానివాళ్లు కడుపు కోసం కాటికాపరులై..

అయినవాళ్లు ఆన్‌లైన్‌లో అంత్యక్రియలు చూస్తే.. కానివాళ్లు కడుపు కోసం కాటికాపరులై..

ఆత్మీయులు కొవిడ్ తో మరణిస్తే అయిన వాళ్లు దగ్గరకు రావడానికి కూడా భయపడుతున్నారు. కానీ ఆ మరణించిన మనిషితో వారికి ఎలాంటి అనుబంధం లేదు.. అయినా కడుపు నిండే మార్గంలేక, నాలుగు డబ్బులు కోసం కాటికాపరులై కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ప్రాణాలకు తెగించి శ్మశానవాటికలో పనిచేస్తున్నారు. వీరంతా బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేసిన వారు. కానీ కరోనా వచ్చి వాళ్ల పొట్ట కొట్టింది. ఉద్యోగం లేక, ఉపాధి మార్గం కోసం అన్వేషిస్తుంటే కాటికాపరి పని కనిపించింది. ఏదైతేనేం.. ఏ జన్మలో వారితో అనుబంధమో అనుకున్నారు మృతదేహాలను కాల్చే బాధ్యత చేపట్టారు.

ఒక్కో దహనానికి రూ.500-1000 దాకా ఇస్తున్నారు. హైదరాబాద్ నగంరంలో దాదాపు 20 శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ హిందూ శ్మశానవాటికలో ఎక్కువ సంఖ్యలో దహన సంస్కారాలు జరుగుతుంటాయి. రోజుకు 10-12 మంది కూలీలు బయట నుంచి వచ్చి పని చేస్తున్నారు. ఒకరు బీకాం ట్యాక్సేషన్ పట్టభద్రుడు.. మరొకరు బీఎస్సీ మేథ్స్ చేశారు.. ఇంకొకరు ఓ ప్రముఖ వ్యాపార సంస్థలో సూపర్ వైజర్ గా పని చేశారు. లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు పోయాయి. దాంతో ఏ పనీ దొరక్క శ్మశాన వాటికల్లో కూలీలుగా పనికి కుదిరారు. మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించడం, అంత్యక్రియలు పూర్తి చేయడం వారి పని.

ఆపదని తెలిసినా పనిచేయక తప్పట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఇక అయిన వాళ్లు కొవిడ్ భయంతో బంధువుల అంత్యక్రియలను ఆన్‌లైన్‌లో చూస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ మృతుల అంత్యక్రియలకు బంధువులను అనుమతించడంలేదు. ఆసుపత్రుల నుంచి మృతదేహాలను నేరుగా శ్మశానాలకు తరలిస్తుండడంతో బంధువులకు కనీసం ఆఖరి చూపులు కూడా దక్కడం లేదు. శ్మశానానికి వచ్చే ఒకరిద్దరు కుటుంబసభ్యులు అంత్యక్రియల దృశ్యాలను వీడియో కాల్ లేదా గ్రూప్ కాలింగ్ లతో బంధువులకు చూపిస్తూ రోదిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story