కరోనా ఎఫెక్ట్.. కడిగీ కడిగీ నీళ్లన్నీ..

కరోనా వచ్చింది.. శుభ్రత పెరిగిపోయింది. ఇంట్లో ఉన్న నలుగురు అస్తమాను ఏదన్నా పెడుతున్నా, తింటున్నా చేతులు కడిగావా అని అడగడం మొదలెట్టారు. ఏం ముట్టుకున్నా చేతులు కడుక్కోవడానికి బాత్ రూమ్ లోకి పరిగెట్టేస్తున్నారు. ఆ పేరుతో ఒకసారి చేతులు కడగడానికి సుమారు 2 లీటర్ల నీళ్లు ఖర్చుపెడుతున్నారని కేంద్ర జల్ శక్తి శాఖ, జల సంరక్షణ కార్యకర్తలు చేపట్టిన సర్వేలో వెల్లడయ్యింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పట్టణాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉన్నందున ఇక్కడ నీటి వినియోగం ఎక్కువగా ఉంది. నీటి వాడకం ఎక్కువయ్యేసరికి భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ముంబై లాంటి నగరాల్లో అయితే మొన్నటి తుఫానుకి చాలా ప్రాంతాలు మునిగిపోయినా.. అనేక ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున నీటి వినియోగం పెరగడం అనేది అనివార్యం అని భావిస్తున్నారు. విద్యుత్ మీటర్ల మాదిరిగానే స్మార్ట్ నీటి మీటర్లు బిగించి నీటి వాడకంపై అవగాహన కల్పించాలని పర్యావరణ ఉద్యమకారుడు ఎస్. బాలకృష్ణన్ అంటున్నారు. అవసరానికి మించి నీటి వాడకం పెరిగితే భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com