నకిలీ కరోనా రిపోర్ట్.. బ్యాంక్ మేనేజర్ బలి

డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ల్యాబ్ టెక్నీషియన్లు. పాజిటివ్ వచ్చినా నెగెటివ్ అని రిపోర్ట్ ఇచ్చి ఓ బ్యాంక్ మేనేజర్ మరణానికి కారణమయ్యారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఈ దారుణం చోటు చేసుకుంది. బ్యాంకు మేనేజర్ దగ్గు, జ్వరం రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోమని చెప్పారు ఫ్యామిలీ డాక్టర్. దాంతో ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకెళ్లాడు. ఫోన్ లో కరోనా లేదని మెసేజ్ పెట్టాడు. దాంతో పాటు ఓ కాపీని కూడా కుటుంబసభ్యులకు అందించాడు. అయితే ఇటీవల మేనేజర్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎమ్ ఆర్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి డాక్టర్లు మేనేజర్ కరోనా రిపోర్టును పరిశీలించి అది నకిలీదని తేల్చారు. రిపోర్ట్ పై ఉన్న పేషెంట్ ఐడీలో తొమ్మిది అంకెలు ఉన్నాయని, అసలైతే 11 అంకెలు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా చేతితో ఈ అంకెలు రాయడాన్ని కూడా వారు ఎత్తి చూపారు. అయితే గురువారం నాడు మేనేజర్ ఆరోగ్యం విషమించి మృతి చెందారు. దీంతో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా సోకిందని ముందుగా తెలిసుంటే వైద్యం చేయించి భర్తను కాపాడుకోగలిగేదాన్నని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Recommended For You