రెండు వేల ఒక వంద మంది అన్నదాతల అప్పులను తీర్చిన మెగాస్టార్

రెండు వేల ఒక వంద మంది అన్నదాతల అప్పులను తీర్చిన మెగాస్టార్

రైతే రాజు. దేశానికి వెన్నెముక. అయితే ప్రకృతితో జూదమాడుతూ రైతులు ఎన్నో కష్టాలు పాలవుతున్నారు. కొందరైతే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకోవడంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముందుంటారు. బీహార్ కు చెందిన 2 వేల మందికి అప్పులను తీర్చేసి, తన పెద్దమనసు చాటుకున్నారాయన.

రైతు పంట పండించకుంటే నాలుగు వేళ్లు నోటిలోకి పోవు. మన దేశంలో తాను చేసిన ఉత్పత్తికి ధర నిర్ణయించుకోలేని నిస్సహాయులు రైతులే. ఆరుగాలం శ్రమించి, పండిస్తే గిట్టుబాటయ్యేది తక్కువే. చాలా మంది వ్యవసాయం నుంచి బయటకు వచ్చి వేరే వృత్తుల్లో స్థిరపడిపోయారు. కొందరు భూమి తల్లితో ఉన్న బంధాన్ని వదులుకోక పంటలు పండిస్తున్నారు. ఈ క్రమంలో ఎందరో రైతులు అప్పులపాలవుతున్నారు. వీరిని ఆదుకోవడంలో బాలీవుడ్‌ బాద్ షా అమితాబ్ కుటుంబం ముందుంటుంది. రుణాలు తీసు కొని, వాటిని చెల్లించలేని స్థితిలో ఉన్న రైతులను అండగా నిలిచింది. బీహార్‌కు చెందిన 2 వేల ఒక వంద మంది అన్నదాతల అప్పులను బిగ్ బీ తీర్చేశారు. వన్ టైం సెటి ల్మెంట్ కింద రుణాలను క్లియర్ చేశారు. కొందరి అప్పులను నేరుగా బ్యాంకుల్లో వేసిన అమితాబ్, మరికొందరిని తన నివాసానికి పిలిపించి చెక్కులు అందచేశారు. అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్, కుమార్తె శ్వేతా బచ్చన్‌లు, రైతులకు చెక్కులు అందించారు.

అన్నదాతలకు అమితాబ్ సాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన చాలా మంది రైతులను ఆదుకున్నారు. గత సంవత్సరం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతుల రుణమాఫీకి సాయం చేశారు. అప్పులు మాఫీ చేయడానికి తన వంతుగా ఐదున్నర కోట్లు అందించారు. ఇచ్చిన హామీని మాత్రమే నెరవేరుస్తున్నానని అమితాబ్ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సి ఉందన్నారు. అమితాబ్ ఒక్కడే కాదు... కొందరు బాలీవుడ్‌ నటులు రైతులకు అండగా ఉంటున్నారు. గతంలో మహారాష్ట్ర లో రైతుల ఆత్మహత్యల మీద స్పందించారు నానాపటేకర్‌. లాతూరు, ఉస్మానాబాద్ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆర్థిక సహాయం అందించారు. బాలీవుడ్‌ నటులను స్ఫూర్తిగా తీసుకొని మన హీరోలుకూడా స్పందిస్తే ఎంతో బాగుంటుంది కదా.

Tags

Read MoreRead Less
Next Story