పోలవరం డయాఫ్రం వాల్‌పై ఓ క్లారిటీ

పోలవరం డయాఫ్రం వాల్‌పై ఓ క్లారిటీ
నిర్మాణంలో సమస్యాత్మకంగా ఉన్న డయాఫ్రం వాల్‌తో పాటు,డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌, కేంద్ర జల సంఘ నిపుణులు కీలక నిర్ణయాలు

ఆం ధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌పై ఓ క్లారిటీ వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యాత్మకంగా ఉన్న డయాఫ్రం వాల్‌తో పాటు,డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌, కేంద్ర జల సంఘ నిపుణులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో గతంలో వచ్చిన భారీ వరదలకు నది లోపలపెద్ద ఎత్తున కోసుకుపోయింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో ఈ విధ్వంసం సాగడంతో నిర్మాణాల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సందేహాలు తలెత్తాయి. డోజింగు, వైబ్రో కాంపాక్షన్‌ పద్ధతుల్లో ఇసుకను నింపి సాంద్రత పెంచి సాధారణ భూ భౌతిక పరిస్థితులు తీసుకురావాలని కేంద్ర జలసంఘం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. ఈ అంశాలపై అధ్యయనం చేసి. ఆ నివేదిక ఫలితాలను కమిటీ ముందుంచారు నిపుణులు. ఇప్పటికే చేసిన పరీక్షల్లో దాదాపు 96 శాతం వరకు ఫలితాలు వస్తున్నందున ఆ విధానంలోనే ముందుకెళ్లాలని డీడీఆర్‌పీ నిర్ణయించింది.

ఇక భారీ వరదలకు దెబ్బతిన్న ఈ నిర్మాణాన్ని ఎలా సరిదిద్దాలనే అంశంపై నిపుణులు ఓ నిర్ణయానికి వచ్చారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ చిన్నచిన్నగా యు ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఆ చిన్న డి.వాల్‌లను ప్రస్తుత డయాఫ్రం వాల్‌తో అనుసంధానించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సిన అవసరం లేదని తేల్చేశారు. లోపలి నుంచి పై వరకు ఇది ఎంతమేర దెబ్బతిందో తెలుసుకోవడానికి జాతీయ జలవిద్యుత్తు పరిశోధన స్థానం నిపుణులు గత ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించారు. డయాఫ్రం వాల్‌ రెండో గ్యాప్‌లో మొత్తం మీద 485 మీటర్ల మేర ధ్వంసమైనట్లు నిపుణులు తేల్చారు. ఎడమ, కుడి వైపున భారీ వరదలకు కోత పడ్డ ప్రాంతంలో అటూ ఇటూ కలిపి దాదాపు 385 మీటర్ల మేర డయాఫ్రం వాల్‌ ధ్వంసమయింది. మధ్యలో మరో 100 మీటర్ల మేర దెబ్బతింది. అది కాకుండా 672 మీటర్ల మేర పైభాగంలో దాదాపు 5 మీటర్ల లోతున అంతా దెబ్బతిందని.. వాటిని సరిదిద్దితే చాలని తేల్చారు నిపుణులు.

మరోవైపు పైన దెబ్బతిన్న ప్రాంతంలో ఎక్కడికక్కడ సమాంతరంగా మూడు మీటర్ల ఎగువన యు’ ఆకారంలో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మిస్తారు. దాన్ని ప్రస్తుత డయాఫ్రం వాల్‌తో అనుసంధానిస్తారు. ఆ ప్రాంతంలో దిగువన రాయి తగిలే వరకు వెళ్లి అందులో నుంచి దీన్ని నిర్మించుకుంటూ రావాలని నిపుణుల కమిటీ సూచించింది. అలాగే డయాఫ్రం వాల్‌ పై భాగంలో దాదాపు 672 మీటర్లు, 5 మీటర్ల లోతున దెబ్బతిన్న ప్రాంతంలో క్లే కోర్‌ బదులు అక్కడ ప్లాస్టిక్‌ కోర్‌ వేసి సరిదిద్దవచ్చని తెలిపారు. ఇందుకు తగ్గ మెథడాలజీ, డిజైన్లు సిద్ధం చేసి కేంద్ర జలసంఘానికి సమర్పించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని డీడీఆర్‌పీ సమావేశంలో నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story