TDP: ధైర్యంగా పోరాడండి: చంద్రబాబు

TDP: ధైర్యంగా పోరాడండి: చంద్రబాబు
చంద్రబాబు పిలుపునిచ్చారన్న అచ్చెన్నాయుడు... చంద్రబాబుతో జైల్లో ములాఖత్‌

ఆంధ్రప్రదేశ్‌ కోసం ధైర్యంగా పోరాడాలని తెలుగుదేశం నాయకులు, శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ములాఖత్‌లో తనను కలిసిన తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఈ విషయాన్ని తెలియజేశారు. 16 రోజులు గడిచినా చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారాన్ని సీఐడీ అధికారులు చూపలేకపోయారని అచ్చెన్న మండిపడ్డారు. జైల్లో మాజీ ముఖ్యమంత్రికి సరైన భద్రత లేదని ఆందోళన వ్యక్తంచేశారు. కనీస ఆధారం లేకుండా చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేసి 16 రోజులుగా జైల్లో ఉంచి వేధిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఐడీ కస్టడీలో మొదటి రోజు 11, రెండో రోజు 22 సంబంధం లేని ప్రశ్నలు వేశారే తప్ప, అవినీతి జరిగిందని కానీ, డబ్బులు ఫలానా ఖాతాలకు మళ్లాయని గానీ ఒక్క ఆధారమూ చూపించలేకపోయారని అన్నారు. ములాఖత్‌లో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబును అచ్చెన్న కలిశారు.


ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవాలంటే పోరాటమే ఏకైక మార్గమని తెలుగు ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని నూరిపోయాలని చంద్రబాబు సూచించినట్లు అచ్చెన్న చెప్పారు. నాయకులంతా ఐక్యంగా పోరాడాలని మార్గనిర్దేశం చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా లక్షల కోట్లు బడ్జెట్‌ రూపొందించి ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు చేసిన వ్యక్తి... 330 కోట్ల అవినీతి చేస్తారా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 16 నెలలు జైల్లో ఉన్న సీఎం జగన్‌, చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టించి వేధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు బెయిల్‌ రాకుండా మరికొన్ని రోజులు అడ్డుకోవాలనే దురుద్దేశంతో మళ్లీ కస్టడీ పిటిషన్‌ వేశారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. జైల్లో చంద్రబాబు భద్రత పట్ల అనుమానాలున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

అరెస్టుకు భయపడి లోకేశ్‌ పారిపోయారని వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అచ్చెన్ననాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున లోకేశ్‌ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. వచ్చే వారం యువగళం ప్రారంభించేందుకు అనుమతులు కోరుతూ దరఖాస్తులు చేసినట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story