Andhra Pradesh : పోలవరం ప్రాజెక్టు మరింత ఆలస్యం

Andhra Pradesh : పోలవరం ప్రాజెక్టు మరింత ఆలస్యం
గోదావరి నదికి వచ్చిన భారీ వరదల కారణంగా ప్రతిపాదిత షెడ్యూల్‌ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మరింత ఆలస్యం కానుంది. తాజాగా నిర్దేశించిన గడువు ప్రకారం పోలవరం ప్రాజెక్టు 2024 మార్చి నాటికి...2024 జూన్‌ నాటికి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పూర్తి కావాల్సి ఉంది. అయితే 2020, 2022ల్లో గోదావరి నదికి వచ్చిన భారీ వరదల కారణంగా ప్రతిపాదిత షెడ్యూల్‌ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడూ.

ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ 13 వేల 226 కోట్లు చెల్లించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చుల చెల్లింపులో ఆలస్యం గురించి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

2014 ఏప్రిల్‌ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చులను కేంద్రం ఎప్పటికప్పుడూ తిరిగి చెల్లిస్తోందని వివరించారు కేంద్రమంత్రి. బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం పరిశీలించి ఆమోదముద్ర వేసిన వెంటనే చెల్లిస్తున్నామన్నారు. 2014 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు ఈ ప్రాజెక్టు కోసం 16 వేల 35 కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు. అందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కేటాయించిన మొత్తాన్ని మినహాయించి..మిగతా 13 వేల 226 కోట్లను కేంద్రం ఇప్పటివరకు విడుదల చేసిందన్నారు. మిగతా 2 వేల 390 కోట్లకు తిరిగి చెల్లించే అర్హత లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పిందన్నారు. వీటితో పాటు మరో 548 కోట్ల బిల్లులు అథారిటీ పరిశీలన కోసం వచ్చాయన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం ఖర్చుల తిరిగి చెల్లింపు..ఏపీ ప్రభుత్వం సమర్పించే బిల్లులు, పీపీఏ, కేంద్ర జల సంఘం సిఫార్సులపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రాజెక్టులో స్పిల్‌వే, ఎగువ కాఫర్‌ డ్యాం, కాంక్రీట్‌ డ్యాం, ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయ్యాయి. నిర్వాసిత కుటుంబాలకు సహాయ పునరావాస కల్పన వివిధ దశల్లో ఉందన్నారు కేంద్రమంత్రి.

పోలవరంలో 960 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టును ఏపీ జెన్‌ కో నిర్మిస్తోందన్నారు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌. 2016-17 నాటి ధరల ప్రకారం ఈ విద్యుత్ ప్రాజెక్టు కోసం 5 వేల 338 కోట్లు ఖర్చవుతుందని ఏపీ జెన్‌ కో చెప్పిందన్నారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్రాంటూ ఇవ్వదని స్పష్టం చేశారు. రాజ్యసభలో వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పునాది కోసం భూమి తవ్వకం పనులు పూర్తయినట్లు జెన్‌కో తెలిపిందన్నారు. 2026 జనవరి నాటికి దీని నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story