TRAIN ACCIDENT: రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతులు

TRAIN ACCIDENT: రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతులు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం... ఒకే ట్రాక్‌పై ముందున్న రైలును వెనకనుంచి ఢీ కొట్టిన మరో రైలు...

విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 100 మందికిపైగా గాయాలయ్యాయి. మృతులసంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకే ట్రాక్‌పై ముందున్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొనడంతో బోగీలు పక్క ట్రాక్‌లోని గూడ్స్‌పైకి దూసుకెళ్ల బీభత్సం సృష్టించాయి. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే విశాఖపట్నం-పలాస రైలు సిగ్నల్‌ కోసం ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి విశాఖపట్నం- రాయగడ రైలు ఢీకొట్టినట్లు స్థానికులు చెప్పారు. దీంతో రాయగడ రైల్లోని 3బోగీలు నుజ్జునుజ్జు కాగా కొన్ని బోగీలు పట్టాలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్సుపైకి దూసుకెళ్లాయి. పలాస రైలు వెనుక బోగీలోని గార్డు, రాయగడ రైలు ఇద్దరు లోకో పైలెట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌, విజయనగరం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.


ఘటనాస్థలికి ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపికలు చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. రైలు ప్రమాదం నేపథ్యంలో ఇవాళ పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కోర్బా-విశాఖపట్నం, పారదీప్‌-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్‌, గుణుపూర్‌-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లను రద్దు చేశారు.


రైలు ప్రమాదంపై ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు 10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి 2లక్షల పరిహారం ప్రకటించారు. ఇతరరాష్ట్రాల మృతుల కుటుంబాలకు 2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి 50వేలు పరిహారం ప్రకటించారు.


ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు, క్షతగాత్రులకు 50వేల పరిహారం ప్రకటించారు. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.


ప్రమాదస్థలం నుంచి ప్రయాణికులందరినీ తరలించినట్లు అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌ ’లో తెలిపారు. ఏపీ సీఎం జగన్‌తో ప్రధాని మాట్లాడారని, రైల్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని రైల్వే మంత్రి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story