AP: సమ్మె విరమించిన అంగన్‌వాడీలు

AP: సమ్మె విరమించిన అంగన్‌వాడీలు
ఒత్తిళ్లు, బెదిరింపులతో సమ్మె విరమింపజేసిన జగన్‌ సర్కార్‌... 42 రోజుల ఆందోళనలు ముగింపు

ఆంధ్రప్రదేశ్‌లో కనీస వేతనం, గ్రాట్యుటీ కోసం 42 రోజులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసిన అంగన్వాడీలు సమ్మె విరమించారు. ఒక్క రూపాయి వేతనం పెంచకుండానే ప్రభుత్వం అంగన్‌వాడీల ఆందోళనలకు ముగింపు పలికింది. వారిని అనేక రకాలు ఒత్తిళ్లు, బెదిరింపులకు గురిచేసి చివరికి సమ్మెను విరమింపజేసింది. 42 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు అంగన్వాడీ సంఘాలు ప్రకటించాయి. నేటి నుంచి విధులకు హాజరుకానున్నట్టు తెలిపాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సోమవారం రాత్రి జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిపాయి.జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గ్రాట్యుటీ అంశాన్ని కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంది. అంగన్వాడీవర్కర్‌కు లక్షా 20 వేలు, హెల్పర్ కు 60 వేలు ఇచ్చేందుకు అంగీకరించింది. అంగన్వాడీ కార్యకర్త చనిపోతే మట్టిఖర్చులకు 20 వేలు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించిందని స్పష్టం చేశారు. పరిహారంగా 2 లక్షలు ఇచ్చేందుకూ అంగీకారం తెలిపింది.


నెలకు ఒక T.A బిల్లును విడుదల చేయడంతో పాటు సంక్షేమ పథకాలూ వర్తింప చేస్తామని హామీ ఇచ్చింది. సమ్మె కాలానికి వేతనం ఇస్తామని కేసులు కూడా ఎత్తివేయనున్నట్టు ప్రభుత్వం చెప్పింది. చర్చల్లో ఇచ్చిన హామీలను లిఖితపూర్వకంగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందనిఅంగన్వాడీ ప్రతినిధులు వెల్లడించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స తెలిపారు. 11 డిమాండ్లలో పదింటిని నెరవేర్చామన్నారు. సమ్మె చేసిన కాలానికి ఏం చేయాలనేదానిపై సీఎంతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అంగన్వాడీల ఆందోళనపై మొదటి నుంచి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బలవంతంగా కేంద్రాలను తెరిపించడం, నోటీసులు జారీ చేయడం, ఎస్మా ప్రయోగించడం వంటి చర్యలకు పాల్పడింది. చివరికి ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమైన కార్యకర్తలు తగ్గకపోగా రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకూ ఏడుసార్లు అంగన్వాడీల ప్రతినిధులతో చర్చలు జరిపిన ప్రభుత్వం వారి ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చకుండానే నామమాత్రపు హామీతో వారి ఆందోళనకు పుల్‌స్టాప్‌ పెట్టింది.


డిమాండ్లు నెరవేర్చాలని అంగన్‌వాడీలు 42 రోజులుగా ఆందోళనలు చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా... ఆందోళనలపై ఉక్కుపాదం మోపినా అంగన్‌వాడీలు ఆందోళన విరమించలేదు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా.. పోలీసులను రంగంలోకి దింపినా వెనక్కి తగ్గలేదు. చివరికి ప్రభుత్వం బెదిరించి... భయపెట్టి అంగన్‌వాడీలతో ఆందోళన విరమింపజేసింది.

Tags

Read MoreRead Less
Next Story