AP CM Jagan : జగన్‌ అక్రమాస్తుల కేసు బదిలీ చేయాలని రఘురామ పిటిషన్‌

AP CM Jagan : జగన్‌ అక్రమాస్తుల కేసు బదిలీ చేయాలని రఘురామ పిటిషన్‌
సాక్షులకు ఇబ్బందని సుప్రీంలో సీబీఐ అఫిడవిట్‌

జగన్‌ అక్రమాస్తుల కేసు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తే సాక్షులకు ఇబ్బంది తలెత్తుతుందని.. కాబట్టి హైదరాబాద్ సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జీ రోజువారీ విచారణ చేపట్టేలా ఆదేశాలివ్వాలని..... సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 39 క్వాష్‌ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలైనట్లు తెలిపింది..

జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన తర్వాత 95 మంది నిందితులు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. క్వాష్‌ పిటిషన్లలో ఒకటి తెలంగాణ హైకోర్టు ముందు, 8 సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. వీటిని విచారించిన ఆరుగురు న్యాయమూర్తులు ఉత్తర్వులు వెలువరించక ముందే బదిలీ అయినట్లు వెల్లడించింది. జగన్ అక్రమాస్తుల కేసు నత్తనడకన సాగుతున్నందున ఈ కేసును దిల్లీకిగానీ, ఇతర రాష్ట్రాలకు గానీ బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట‌్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తోపాటు పలువురు ఎంపీలు, సినీయర్‌ ఐఏఎస్‌లు, కార్పొరేట్ సంస్థలు, బడా వ్యాపారులు నిందితులుగా ఉన్నారు. ప్రధాన నిందితుడితోపాటు ఇతర నిందితులు ఏదో ఒక కారణం చూపుతూ కోర్టుల్లో విచారణలు సాగకుండా పిటిషన్లు దాఖలు చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని 2018 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2013 నుంచి ఇప్పటి వరకు సీబీఐ కోర్టుకు ఆరుగురు ముఖ్యన్యాయమూర్తులు వచ్చారు. వారంతా డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు విన్నప్పటికీ తుది ఉత్తర్వులు జారీ చేయక ముందే బదిలీ అయిపోయారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ సీఐబీ కోర్టుకు ఒక ముఖ్య ప్రత్యేక న్యాయమూర్తి, ముగ్గురు అదనపు ప్రత్యేక న్యాయమూర్తులను కేటాయించారు. అక్కడున్న మూడు ప్రత్యేక కోర్టుల బాధ్యతలనూ ఒక అదనపు న్యాయమూర్తి మాత్రమే నిర్వర్తిస్తున్నారు. ప్రిన్సిపల్‌ జడ్జి మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ గనుల తవ్వకాల కేసుపై రోజువారీ విచారణ చేపట్టారు. ఆయన ఎమ్మార్, వివేకానందరెడ్డి హత్యలాంటి కీలక కేసులతోపాటు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని సీబీఐ విభాగాలు దర్యాప్తు చేస్తున్న కేసులనూ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో ఉన్న రెండు అదనపు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ప్రిన్సిపల్‌ జడ్జి కోర్టును.. జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులను రోజువారీ విచారించే ప్రత్యేక కోర్టుగా ప్రకటించాలని సీబీఐ అఫిడవిట్‌లో కోరింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లలో 911 మంది సాక్షులున్నారని వీరిలో చాలామంది 50 ఏళ్లు, అంతకంటే పై వయసు పడిన వారే ఉన్నందున ఈ కేసు విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తే సాక్షులకు ఇబ్బంది వస్తుందని సీబీఐ అఫిడవిట్‌లో తెలిపింది. కాబట్టి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ప్రిన్సిపల్ జడ్జి కోర్టుకు జగన్‌ కేసుల రోజువారీ విచారణ బాధ్యతలు చూసేలా ఆదేశాలివ్వాలని కోరింది.

Tags

Read MoreRead Less
Next Story