BABU BAIL: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌

BABU BAIL: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌
తీర్పు వెలువరించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు

అంగళ్లు కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్లు కూడలి వద్ద చోటు చేసుకున్న ఘటనలో టీడీపీ నేతలతోపాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 8న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి చెందిన వారే చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు విసిరారని తెలిపారు. వ్యక్తిగత భద్రతాసిబ్బంది చంద్రబాబుకు రక్షణగా నిలిచిందని వివరించారు. అందుకు సంబంధించిన వీడియోలను కోర్టుకు అందజేశారు.


వైసీపీకి చెందిన వారు దాడులకు పాల్పడి నాలుగు రోజుల ఆలస్యంగా తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. జాప్యానికి కారణాలు చెప్పలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ర్యాలీ నిర్వహించారని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ర్యాలీలో అలజడులు సృష్టించాలని ముందస్తు ప్రణాళికతో రాళ్లురువ్వారన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పలువురికి హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు సైతం ఆ ఉత్తర్వులను సమర్థించిందన్నారు. పిటిషనర్‌కు ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరారు.

పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌ ప్రోద్బలంతో దాడి ఘటన చోటు చేసుకుందన్నారు. పిటిషనర్‌, ఆయన అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. పిటిషనర్‌ చెప్పాకే దాడులకు దిగారని.. పోలీసులకు గాయాలు అయ్యాయన్నారు. రాజకీయ ప్రతీకారంతో కేసు పెట్టామనడంలో వాస్తవం లేదన్నారు. బెయిలు పిటిషన్‌ కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసి.. నేడు చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

Tags

Read MoreRead Less
Next Story