AP: పాత్రికేయులపై దాడులను నిరసిస్తూ ఎగిసిపడ్డ ఆందోళనలు

AP: పాత్రికేయులపై దాడులను నిరసిస్తూ ఎగిసిపడ్డ ఆందోళనలు
వైసీపీ నేతల దాడులపై మండిపడ్డ పాత్రికేయ సంఘాలు, ప్రతిపక్షాలు... ఓటమి భయంతోనే దాడులని విమర్శ

ఆంధ్రప్రదేశ్‌లో పాత్రికేయులు, పత్రికా సంస్థలపై దాడులను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడిని జర్నలిస్టులు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఖండించాయి. వైసీపీ నేతల అక్రమాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలను బయటపెడితే దాడులు చేస్తారా అని నేతలు ప్రశ్నించారు. వైకాపా పాలనలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడికి నిరసనగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం, జనసేన నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పత్రికా స్వేచ్ఛను దెబ్బతిసే విధంగా వైకాపా రౌడీ మూకలు దాడులకు తెగబడటం హేయమైన చర్య పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు.


పత్రికా స్వేచ్ఛను హరించే ముఖ్యమంత్రి జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై గళమెత్తే పత్రికా సంస్థలపై దాడి చేయటం దారుణమని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో ముస్లింలు నిరసన ప్రదర్శన చేశారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర పోషించే మీడియాపై దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. పత్రికలపైనే వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తుంటే...ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.


అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ఏపీయూడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో పాత్రికేయులు ఆందోళన చేశారు. జర్నలిస్టులపై వైసీపీ రౌడీ మూకలు చేస్తున్న దాడులు హేయమైన చర్య అని తెలుగుదేశం విజయనగరం నియోజకవర్గ ఇంఛార్జి గజపతిరాజు అన్నారు. వైయస్సార్ జిల్లా బద్వేలులో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రొద్దుటూరులో తహశీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. వాస్తవాలను చెప్పే పత్రికా సంస్థలపై దాడి చేయటం ఏంటని బీజేపీ నేత రాఘవేంద్ర ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. నంద్యాల జిల్లా పాణ్యంలో జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నేతలు నిరసన కార్యక్రమాలు చేశారు. నంద్యాల జిల్లా డోన్‌లో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతపురం జిల్లా సింగనమలలో పాత్రికేయులు ఆందోళన చేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story