గ్రామ వాలంటీర్ ద్వారా వెలుగులోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారం

గ్రామ వాలంటీర్ ద్వారా వెలుగులోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారం

తెల్లరేషన్ ఎవరికి ఉండాలి.. పేదవారికి కదా ఉండాల్సింది.. కానీ ఎన్నో ఏళ్లుగా డాక్టర్‌ గా పనిచేస్తూ, కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తికి నిరుపేదలకు ఇచ్చే తెల్ల రేషన్ కార్డ్‌ ఉంది. ఆ డాక్టర్ వైసీపీలో చేరి, ఎమ్మెల్యే అయ్యాడు. అయినా రేషన్ కార్డ్‌ రద్దు కాలేదు. గ్రామ వాలంటీర్‌ ఈ నెల రేషన్ సరుకులను ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అందించడంతో తెల్ల రేషన్ కార్డ్‌ వ్యవహారం బయటపడింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. తొలుత గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ బాగా పని చేస్తుందనడానికి తన ఉదంతమే నిదర్శమని ఎమ్మెల్యే చెప్పాడు. తీవ్ర విమర్శలు రావడంతో తనకున్న తెల్ల రేషన్ కార్డ్‌ తొలగించాలని కోరానంటున్నాడు.

పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జీఎం రియల్‌ ఎస్టేట్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు తెల్ల రేషన్ కార్డు ఉంది. దీంతో గ్రామ వాలంటీర్ ఆయన ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు అందించాడు. సాధారణంగా నిరుపేదలకు మాత్రమే తెల్ల రేషన్ కార్డ్‌ ఉండాలి. కానీ ఎమ్మెల్యే డాక్టర్‌ గా పని చేస్తూ కోట్లు సంపాదించాడు. అయినా ఆయనకు తెల్లరేషన్ కార్డ్‌ ఉంది. దీంతో ఎమ్మెల్యేతో గొడవ ఎందుకు అనుకున్నాడో ఏమో గ్రామ వాలంటీర్ తన డ్యూటీ తాను చేశాడు. అందరికీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి రేషన్ సరుకు ఇచ్చాడు. ఇది వివాదాస్పదం కావడంతో అప్పలరాజు స్పందించాడు. అసలు తనకు తెల్ల రేషన్ కార్డు ఉందన్న సంగతే తెలియదని చెప్పారు. ఒకవేళ కార్డు ఉంటే ఇన్నాళ్లూ రేషన్‌ తీసుకోనందుకు అది క్యాన్సిల్‌ కావాలి కదా అని ప్రశ్నించారు. దీని మీద విచారణకు ఆదేశిస్తామన్నారు. అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ పనితీరుకు ఈ ఘటన నిదర్శనమని కితాబిస్తున్నాడు.

సాధారణంగా నేరుగా దరఖాస్తు చేస్తే గానీ తెల్ల రేషన్ కార్డు ఎవరికీ దక్కదని ప్రతిపక్షాలంటున్నాయి. ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకున్నా ఈ విషయం పైన ఇంకా చర్చ సాగుతూనే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story