AP: డిస్మిస్‌ చేస్తున్నా తీరు మారని వాలంటీర్లు

AP: డిస్మిస్‌ చేస్తున్నా తీరు మారని వాలంటీర్లు
నేతల ఒత్తిడితో ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లు... ఇంకా వైసీపీ నేతలకు ప్రచారం

ఎన్నికల సంఘం ఆదేశాలు, ప్రవర్తనా నియమావళిని లెక్క చేయకుండా వైసీపీ అనుకూల ప్రచారాన్ని చేపట్టిన వాలంటీర్లు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని అధికారులు డిస్మిస్‌ చేస్తున్నా మరికొందరు ఆ పార్టీకి ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. స్థానిక వైసీపీ నేతలు, ఐప్యాక్‌ సభ్యులు, మండల స్థాయి అధికారుల ఒత్తిడి భరించలేక కొందరు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ పీసీపల్లి మండలంలోని నేరేడుపల్లి, పోతవరం, వరిమడుగు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో కనిగిరి ఆర్టీసీ డిపో కండక్టర్‌ ఓబుల కొండారెడ్డి పాల్గొన్నారు. ఈయన వైసీపీ నాయకురాలు, పీసీపల్లి జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీకాంతం భర్త. పొదిలిలో మార్కాపురం వైసీపీ అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు కుమారుడు కృష్ణచైతన్య వెంట మల్లవరం విద్యుత్తు ఉపకేంద్రం షిఫ్టు ఆపరేటర్‌ షేక్‌ గౌస్‌ మొహియుద్దీన్‌ పాల్గొని ప్రచారం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్‌నాయుడు యడ్లపాడులో నిర్వహించిన ప్రచారంలో వీఆర్‌ఏ అంబటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లాలో నిబంధనలు అతిక్రమించి వైకాపా ప్రచారాల్లో పాల్గొన్న ఒప్పంద ఉద్యోగులనూ విధుల నుంచి తొలగించారు. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం చీకటిపల్లి ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు వెంకటేష్, కుప్పం మండలం సాంకేతిక సహాయకుడు మురుగేష్‌ను విధులనుంచి తప్పించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇటీవల వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వార్డు వాలంటీరు జె.రవిని విధులనుంచి తీసేశారు. పట్టణ చౌకధరల డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడు మేకల శ్రీనివాసులు, డీలర్లు వంశీకృష్ణ, కృష్ణమూర్తి, రఫీక్‌ డీలర్‌షిప్‌లను రద్దు చేశారు.

మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాల్ని వాలంటీర్లు ఖాతరు చేయడం లేదు. వైసీపీ నేతలకు అనుకూలంగా ఇంటింటి ప్రచారం చేస్తూ స్వామి భక్తి చాటుకుంటున్నారు. ఈసీ నిబంధనలు అతిక్రమించిన... 30 మంది వాలంటీర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. అయినా స్థానిక నేతల ఒత్తిడితో కొందరు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా తీసుకుంటూ వైసీపీకి ఊడిగం చేస్తున్న 30 మంది వాలంటీర్లపై వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉన్నతాధికారులు 30 మంది వాలంటీర్లను డిస్మిస్‌ చేశారు. అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లకూడదని ఆదేశాలిచ్చారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన ‘సిద్ధం గ్రామస్థాయి సభలో ‘మేమూ సిద్ధమే’అంటూ పాల్గొన్న 16 మంది గ్రామ వాలంటీర్లను అక్కడి అధికారులు డిస్మిస్‌ చేశారు. ఇరుసుమండ, మొసపల్లి గ్రామాలకు చెందిన 16 మంది వాలంటీర్లను తొలగించారు.

Tags

Read MoreRead Less
Next Story