Konaseema: పచ్చని పంటపొలాల మధ్య ఆక్వాసాగు చిచ్చు

Konaseema: పచ్చని పంటపొలాల మధ్య ఆక్వాసాగు చిచ్చు
రొయ్యలసాగులో వినియోగించే రసాయనాల ప్రభావంతో.. బీడు భూములుగా మారిన పంటపొలాలు

పచ్చని పంటపొలాల మధ్య ఆక్వాసాగు చిచ్చుపెడుతోంది. రొయ్యలసాగులో వినియోగించే రసాయనాల ప్రభావంతో బంగారం లాంటి పంట పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయి. దీంతో అన్నదాత ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో అక్రమ రొయ్యలసాగుతో పంట పొలాల్లో కనీసం వరి కూడా వేయడానికి రాకపోవడంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

అవిడి ఉచ్చులవారి పేట శివారులో తవ్విన సుమారు 20 ఎకరాల రొయ్యల చెరువుల వల్ల చుట్టుపక్కల 40 ఎకరాల్లో వరిపొలాలు బీడు భూములుగా మారిపోయాయి. కనీసం తమను సంప్రదించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరిసాగు చేసుకొని జీవనోపాధి పొందే తాము ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ఆక్వాసాగు వల్ల నిస్సారంగా తయారయిన వరిపొలాలను రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు పరిశీలించారు. ఆక్వాసాగుపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాధుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పని పరిస్థితుల్లో కొన్నిచోట్ల ఆక్వాసాగుతో పంటలు పండక అవికూడా రొయ్యల చెరువులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు రైతులు. నియోజకవర్గ వైసీపీ నాయకుల అండదండలతోనే ఆక్వా మాఫియా చెలరేగిపోతుందంటూ ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నష్టపరిహారం ఇస్తాం.. పొలాలను వదిలి వెళ్లాలని ఆక్వా మాఫియా తమను భయభ్రాంతులకు గురిచేస్తోందంటున్నారు రైతులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమంగా ఆక్వా చెరువులను సాగు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story