BABU BAIL: రెండోరోజూ హోరాహోరీ వాదనలు

BABU BAIL: రెండోరోజూ హోరాహోరీ వాదనలు
బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ ఇవాళ్టికి వాయిదా... చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ ఈ నెల 19వరకు పెంపు...

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్, CIDకస్టడీ పిటిషన్లపై విజయవాడ ACB కోర్టులో వరసగా రెండో రోజూ హోరాహోరీగా వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి నిధులు మళ్లాయంటూ బ్యాంకు స్టేట్‌మెంట్లను కోర్టుకు సమర్పించారు. తెలుగుదేశం ఖాతాలకు నిధులు మళ్లించారంటూ.. కొన్ని పత్రాలు చూపించారు. ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన సంభాషణలంటూ న్యాయమూర్తి ముందు మరికొన్ని పత్రాలు ఉంచారు. సీఐడీ వద్ద ఉన్న ఫైళ్లను న్యాయమూర్తికి చూపించారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదని, ఒప్పందంలో జరిగిన తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడని ఏఏజీ వాదించారు. చంద్రబాబుని ఇంకా విచారించాల్సి ఉందన్నారు. అవినీతి నిరోధక చట్టం చంద్రబాబుకు వర్తిస్తుందని వాదించారు. రిమాండ్‌ను 15రోజులు పొడిగించాలంటూ మెమో దాఖలు చేశారు.


చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ప్రమోద్‌ కుమార్ దూబే స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారని వాదించారు. డిజైన్‌టెక్‌తో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు నిధులు మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. ఆ తరువాత ఒప్పందం ప్రకారం 40 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. రెండు లక్షల మందికిపైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారని అంతా ఓపెన్‌గా జరిగితే ఇందులో కుంభకోణం ఎక్కడుందని ప్రశ్నించారు. చంద్రబాబు పాత్ర ఎక్కడుందని వాదించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదని కోర్టుకు వివరించారు. ఇప్పటికే కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారని తెలిపారు. ఇక కస్టడీ అవసరం లేదని అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారని దూబే వాదించారు. ఈ అంశాల్ని పరిశీలించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.


ఉదయం వాదనలు సజావుగా సాగినా భోజన విరామం తర్వాత ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరం నెలకొంది. బెయిల్ పిటిషన్‌పై ఇరువైపు వాదనలు పూర్తయినా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మళ్లీ వాదనలు వినిపిస్తానని కోర్టును కోరారు. ఆ అభ్యర్థనపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అదనపు ఏజీ వాదనలకు తాము రిప్లై వాదనలు చెప్పామని మళ్లీ వీటిపై వాదనలు వినిపిస్తానంటే చట్టప్రకారం కుదరదన్నారు. ఈ సమయంలో ఇరువైపు న్యాయవాదుల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. అదనపు ఏజీ స్వరం పెంచి కేకలు వేశారు. నా ముందు మీరెంత? అంటూ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది దూబేపై పెద్దగా అరుస్తూ కేకలు వేశారు. వాదనలు చెబుతానంటే ఎందుకు భయపడుతున్నారంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. పొన్నవోలు వ్యాఖ్యలపై దూబే తీవ్రంగానే స్పందించారు. ‘‘మేము మీకేమి భయపడట్లేదు. మీ వాదనలు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే మేము రిప్లై వాదనలు చెప్పాక... మళ్లీ రిప్లై వాదనలు వినిపిస్తానని మీరు అనటం ఏంటన్నారు.

దీంతో అనిశా కోర్టు న్యాయాధికారి హిమబిందు స్పందిస్తూ.. విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని, బెయిలు పిటిషన్‌పై అదనపు ఏజీ కొద్ది సమయం వాదనలు వినిపించాక, పోలీసు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపారు. మరోవైపు రిమాండ్‌ గడువు ముగియడంతో చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు.ఈనెల19వరకూ చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది.

Tags

Read MoreRead Less
Next Story