BABU CASE: నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ విచారణ

BABU CASE: నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ విచారణ
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు పిటిషన్‌... నేడు ధర్మాసనం విచారణ...

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెక్షన్ 17A కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ..తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంని ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఐటం 61 కింద ఈ కేసు లిస్ట్‌ అయింది.


అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బెంచ్‌ ముందు మెన్షన్‌ చేశారు. ఇందులో అత్యవసరత ఉన్నందున వెంటనే విచారణకు స్వీకరించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీజేఐ స్పందిస్తూ మంగళవారం రమ్మని చెప్పారు. అయితే మంగళవారం సీజేఐ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూర్చోవడంతో ఈ కేసు ఆయన ముందుకు రాలేదు. అత్యవసర విచారణకు స్వీకరించాలని చంద్రబాబు న్యాయవాదులు ఇచ్చిన మెన్షనింగ్‌ స్లిప్‌ను పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ కేసును జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ల ధర్మాసనం ముందు లిస్ట్‌ చేసినట్లు తెలిసింది.


మరోవైపు అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిలు కోరుతూ హైకోర్టులో చంద్రబాబు వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేశారు. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు..పిటిషనర్‌ వేరే కేసులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నందున ప్రస్తుత కేసులోనూ అరెస్టయినట్లు భావించాలన్నారు. అందుకే బెయిలు పిటిషన్‌ వేశామన్నారు. పిటిషనర్‌ జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నట్లు దర్యాప్తు అధికారికి సమాచారం ఉంటే సరిపోతుందన్నారు. తమ పిటిషన్‌కు విచారణార్హత ఉందన్నారు. అధికార పార్టీకి వ్యక్తులు అంగళ్లులో రాళ్లు విసరగా... వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంద్రబాబుకు రక్షణగా నిలిచిన విషయం ప్రస్తావించారు. సంబంధిత వీడియోలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీకి చెందినవారే దాడులకు పాల్పడి, 4 రోజుల ఆలస్యంగా తప్పుడు ఫిర్యాదు చేశారని వివరించారు. పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story