BABU REMAND: మానసికంగా వేధించారు

BABU REMAND: మానసికంగా వేధించారు
ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు వాంగ్మూలం... ప్రాథమిక సాక్ష్యాలు లేకుండానే అరెస్ట్‌ చేశారన్న తెలుగుదేశం అధినేత

పోలీసులు తనను మానసికంగా వేధించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు న్యాయస్థానానికి తెలిపారు. ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే తనను అరెస్ట్ చేశారని, ఆ తర్వాత వాహనంలో తిప్పుతూనే ఉన్నారని న్యాయాధికారికి వాంగ్మూలం ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయాధికారి హిమబిందు ఎదుట చంద్రబాబు వాంగ్మూలం ఇచ్చారు.


సీఐడీ కస్టడీలో పోలీసులు తనను మానసికంగా వేధించారని, ఆదివారం ఉదయం 8 గంటల వరకూ... రోడ్లపై వాహనంలో తిప్పుతూనే ఉన్నారని న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు చెప్పారు. పోలీసులు తనను ఇంటరాగేట్ చేస్తున్న దృశ్యాలను దురుదేశపూర్వకంగా ప్రత్యక్ష ప్రసారం చేయించారని, ఆ అధికారం వారికి లేదన్నారు. సీఐడీ కస్టడీలో ఉండగా తనకు మొదట ఒక వైద్యుడు పరీక్షలు చేశారని, తర్వాత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. తనకు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినట్లు పరీక్షల్లో తేలిందన్నారు.


ఏ సమయంలో అరెస్ట్ చేశారన్న న్యాయాధికారి ప్రశ్నకు తాను బస చేసిన ప్రదేశాన్ని శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి పోలీసులు ముట్టడించారని చంద్రబాబు తెలిపారు. శనివారం తెల్లవారు జామున ఐదు-ఐదున్నర గంటల సమయంలో CIDడీఐజీ రఘురామిరెడ్డి, కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ్ తన దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారని చెప్పారు. వారి రాకకు కారణమేంటని అడిగితే అరెస్ట్ నోటీసు అందించారని కేసు వివరాలు అడిగితే సమాధానం చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారా? అన్న ప్రశ్నకు... 'శారీరకంగా ఇబ్బంది పెట్టలేదుగానీ మానసికంగా వేధిస్తూనే ఉన్నారు' చంద్రబాబు బదులిచ్చారు.

కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చారా? అన్న ప్రశ్నకు మొదట FIR అరెస్ట్ నోటీసులే ఇచ్చారని తెలిపారు. కోర్టులో హాజరుపరచడానికి కొంచెం ముందు మాత్రమే రిమాండ్ నోటీసు అందించారని వాంగ్మూలంలో చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే తనను అరెస్ట్ చేశారని, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అధికారి కాకపోయినా సీఐడీ డీఐజీ తనను ఇంటరాగేట్ చేశారని, ఆ అధికారం ఆయనకు లేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వాంగ్మూలానికి సంబంధించిన వివరాలన్నీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story