BABU: చంద్రబాబుకు డీ హైడ్రేషన్‌, అలర్జీ

BABU: చంద్రబాబుకు డీ హైడ్రేషన్‌, అలర్జీ
రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు అనారోగ్యం... పరీక్షించిన వైద్యులు

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీ హైడ్రేషన్‌, చర్మ సంబంధిత అలర్జీతో బాధపడుతున్నారు. చర్మంపై పలుచోట్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నెలరోజులుగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును వైద్యులు పరీక్షించారు. జైలు అధికారులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి లేఖ రాసి చర్మ వైద్య నిపుణులను పంపించాలని కోరారు. G.G.H. నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కారాగారానికి వెళ్లి చంద్రబాబును పరీక్షించారు. 6 గంటల 30 నిమిషాలకు వారు బయటకు వచ్చారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా వారు మాట్లాడేందుకు నిరాకరించారు.


చంద్రబాబు చేయి, ఛాతీ, గడ్డంపైనా దద్దుర్లు ఏర్పడినట్లు తెలిసింది. జైలు ఇంఛార్జ్‌ పర్యవేక్షకుడు రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా చంద్రబాబుకు చర్మ సంబంధిత అలర్జీ రావడంతో వైద్య నిపుణులకు చూపించామన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు సూచించిన మందులు అందజేస్తామని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని ఆందోళన అవసరం లేదంటూ ఓ బులిటెన్‌ విడుదల చేశారు.


రాజమహేంద్రవరంలో కొద్దిరోజులుగా తీవ్రమైన వేడి, ఉక్కబోత వల్ల చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు ఇటీవల తెలిపారు. ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును మంగళవారం జైలులో కలిశారు. చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురైన విషయాన్ని వారే వెల్లడించారు. చంద్రబాబు నీరసంగా ఉన్నారని, ముఖం లాగేసినట్లు కనిపించారంటూ తన తల్లి చెప్పినట్లు లోకేష్‌ బుధవారం చెప్పారు. చంద్రబాబు బాగా బరువు తగ్గినట్టు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుర్తించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బరువు తగ్గడాన్ని నీరియస్‌గా తీసుకోవాలని, డీహైడ్రేషన్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చునని వైద్యులు సూచించినట్లు సమాచారం. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మొదటి నుంచీ చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల వినతిని అధికారులు పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుకు జైల్లో వసతులు కల్పించకుండా శారీరకంగా ఇబ్బంది పెడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్‌ కక్ష్యపూరిత విధానాలు అవలంభిస్తున్నారంటూ ప్రజలు భగ్గుమంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story