AP: గుంటూరు గుండెల్లో డయేరియా డేంజర్‌ బెల్స్

AP: గుంటూరు గుండెల్లో డయేరియా డేంజర్‌ బెల్స్
డయేరియా లక్షణాలతో ఇప్పటికే ఇద్దరు మృతి.... ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం

గుంటూరు నగరవాసుల గుండెల్లో డయేరియా డేంజర్ బెల్స్‌ మోగుతూనే ఉన్నాయి. రెండు వారాలుగా వాంతులు, విరేచనాలతో ప్రజలు ఆసుపత్రుల్లో చేరడం స్థానికుల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు డయేరియా లక్షణాలతో ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు నగరంలో సరఫరా అవుతున్న కలుషిత తాగునీరు... ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా... డయేరియా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికీ కలుషిత నీరే తాగాల్సిన దుస్థితి ఉందని వాపోతున్నారు. రైలు పేట, కొత్తపేట, ఇజ్రాయెల్ పేట, మణిపురం తదితర ప్రాంతాల్లో కుళాయి నీళ్లు రోజువారీ అవసరాలకు వినియోగించేందుకు పనికిరావడంలేదని మండిపడుతున్నారు.


శారదాకాలనీకి చెందిన పద్మ, రైలు పేటకు చెందిన షేక్‌ ఇక్బాల్‌ మృతికి కలుషిత నీరే కారణమన్న ఆరోపణలతో నగరవాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండు వారాలకు పైగా తాగునీరు కలుషితమవుతోందని, ఆ నీరు తాగి ఇంట్లోని కుటుంబసభ్యులు అనారోగ్యం బారిన పడ్డారని రైలుపేట వాసులు ఆరోపించారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని అసహనం వ్యక్తం చేశారు. కొత్తపేట, నెహ్రూనగర్, మణిపురం ప్రాంతాల్లో చిన్నారులు, పెద్దలు వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీటి కట్టడికి చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్, స్థానిక M.L.A. దృష్టికి తీసుకెళ్లినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవటంలేదని మండిపడుతున్నారు.


డయేరియా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జీజీహెచ్‌లో డయేరియాతో బాధపడుతున్న వారిని మనోహర్ శనివారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 మంది రోగులు డయేరియాతో జీజీహెచ్‌కు వచ్చారని చెప్పారు. వీరికి ప్రభుత్వం సరైన వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా.. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో డోర్ టు డోర్ సర్వే చేయాలని కోరారు.

రూ.1400 కోట్ల బడ్జెట్ ఉన్న కార్పొరేషన్‌లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక ప్రణాళిక ప్రకారం తాగునీటిని అందించలేకపోయారని మండిపడ్డారు. ఇప్పటికే డయేరియాతో ముగ్గురు చనిపోయారని.. ఎంతో మంది ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ ధైర్యం చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story