AP: కూటమి అభ్యర్థుల ప్రచార దూకుడు

AP: కూటమి అభ్యర్థుల ప్రచార దూకుడు
మండే ఎండలను లెక్క చేయకుండా విస్తృత ప్రచారం.... ఇంటింటి ప్రచారాలతో హోరెత్తుతున్న ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూకుడు పెంచారు. మండే ఎండలనూ లెక్క చేయకుండా నియోజకవర్గాల్లో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీ అభ్యర్ధుల ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో పలాస కూటమి అభ్యర్థి శిరీష ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు నృత్యాలు చేయగా శిరీష కూడా వారితో కలసి కాలు కదిపారు. మత్స్యకారుల సమస్యల్ని మంత్రి అప్పలరాజు పట్టించుకోలేదని శిరీష ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గోండు శంకర్ నగరంలో సైకిల్ యాత్ర చేపట్టారు, అరసవల్లి కూడలి నుంచి ఏడు రోడ్లు కూడలి వరకు జరిగిన సైకిల్ యాత్రలో వేలాదిమంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


జగన్‌ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని పాయకరావుపేట కూటమి అభ్యర్థి అనిత విమర్శించారు. అనకాపల్లి జిల్లా S.రాయవరం మండలం బంగారమ్మపాలెంలో ఆమె ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్‌ ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టణంలో నెలకొన్న మురుగునీటి సమస్యను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన భార్య కృష్ణ తులసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అపార్ట్‌మెంట్లలో ఓటర్లను కలసి ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య చెప్పారు. చీరాల మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఉదయపునడక చేస్తున్న వారిని పలకరించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు.


అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం సమక్షంలో 50 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. మైదుకూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. దువ్వూరు మండలం పెద్దజొన్నవరంలో పార్టీ శ్రేణులతో ప్రచారం నిర్వహించారు. సూపర్‌సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. YSR జిల్లా వేంపల్లిలో కడప ఎంపీ కూటమి అభ్యర్థి భూపేష్‌ రెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్‌ బాగుపడుతుందని భూపేష్‌ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.

కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్‌కుమార్‌కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. టి.కొత్తపల్లికి విచ్చేసిన పొన్నాడను MRPS నాయకులు అడ్డుకున్నారు. తాము అభ్యంతరం చెబుతున్నా ఎమ్మెల్యే.....బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాల వేశారని ఆరోపిస్తూ..దండను తొలగించారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ MRPS శ్రేణులు నినాదాలు చేయడంతో చేసేదేం లేక ఆయన అక్కడ్నుంచి వెనుదిరిగారు.

Tags

Read MoreRead Less
Next Story