ప్రసిద్ధ ర‌చ‌యిత కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత

ప్రసిద్ధ ర‌చ‌యిత కేతు విశ్వనాథరెడ్డి  కన్నుమూత
రాయలసీమ కథలకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూశారు

ప్రసిద్ధ క‌థా, న‌వ‌లా ర‌చ‌యిత, రాయలసీమ కథలకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూశారు. క‌డ‌పలోని సింగ‌పూర్ టౌన్‌షిప్‌లో భార్యతో క‌లిసి ఆయ‌న ఉండేవారు. రెండ్రోజుల క్రితం ఒంగోలులో ఉంటున్న కుమార్తె వ‌ద్దకు వెళ్లారు. ఈ ఉద‌యం ఐదు గంట‌ల‌కు గుండెపోటుకు గురయ్యారు. వెంట‌నే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించ‌డానికి ప్రయ‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. అప్పటికే ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్టు వైద్యులు తెలిపారు.

కేతు విశ్వనాథ్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా ఎర్రగుంట్ల మండ‌లం రంగ‌శాయిపురం. సాహితీ, విద్యావేత్తగా ల‌బ్ధిప్రతిష్టుడు. రాయ‌ల‌సీమ మాండ‌లికానికి సాహితీ గౌర‌వం తీసుకొచ్చిన ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. కేతు విశ్వనాథ‌రెడ్డి క‌థ‌ల‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది. క‌డ‌ప జిల్లా గ్రామ‌నామాల‌పై ప‌రిశోధ‌న‌కు ఆయ‌న డాక్టరేట్ పొందారు. జ‌ర్నలిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాల‌యం డైరెక్టర్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు కథా సంపుటాలు, వేర్లు, బోధి అనే న‌వ‌ల‌లు వెలువ‌రించారు. రాయ‌ల‌సీమ మాండ‌లికంలో సాగిన ఈయ‌న ర‌చ‌న‌లు మ‌ట్టి ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లాయి. ఈయన రాసిన అనేక‌ కథలు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువాదం అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story