పరీక్షా పత్రాల లీకేజీలో భారీ స్కాం జరిగింది - చంద్రబాబు

పరీక్షా పత్రాల లీకేజీలో భారీ స్కాం జరిగింది - చంద్రబాబు

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఫలితాల ప్రక్రియ రికార్డు స్థాయిలో నిర్వహించినట్లు అధికారులు చెప్పుకుంటున్నా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీపీఎస్సీ నుంచి పేపర్‌ లీక్‌ అయినట్లు జరుగుతున్న ప్రచారం అభ్యర్థుల్లో అసంతృప్తికి దారితీసింది. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు పరీక్ష పత్రాల లీకేజీపై టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు ఆందోళన చేపట్టారు. ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.

ఎంతో పకడ్బందీగా, పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం, అధికారులు చెబుతుంటే పరీక్ష పత్రాల లీకేజీపై సమాధానం చెప్పాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగాల పరీక్షలపై నిరుద్యోగుల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. హడావిడి ప్రకటనలతో ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షలకు అర్హత సాధించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మెరిట్‌ జాబితాలను ప్రకటించిన అధికారులు కట్‌ ఆఫ్‌ మార్కులు, ఖాళీల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ఇంకా జిల్లాలకు చేరకపోవడంతో.. అభ్యర్థుల్లో తీవ్ర అయోమయం ఏర్పడింది. ఈ అయోమయం అనుమానాలకు దారితీస్తోంది.

అటు గ్రామ సచివాలయ పరీక్ష పత్రాల లీకేజీపై TNSF విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. విజయవాడలోని APPSC కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆందోళనకు దిగిన TNSF నాయకులను బలవంతంగా అరెస్ట్‌ చేశారు పోలీసులు. పరీక్షల ఫలితాలు వెంటనే రద్దు చేసి తిరిగి పరీక్షలు నిర్వహించాలని వారంతా డిమాండ్ చేశారు.

పేపర్‌ లీకేజీ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా పత్రాల లీకేజీలో భారీ కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయిన నిరుద్యోగులకు ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. అవినీతి పరులకు అధికారం దక్కితే ఇంకా పెద్ద అవినీతి చేస్తారనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం నిరూపించిందని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Also watch:

Tags

Read MoreRead Less
Next Story