AP: మూడు రాజధానుల నాటకానికి నేటితో నాలుగేళ్లు

AP: మూడు రాజధానుల నాటకానికి నేటితో నాలుగేళ్లు
కొనసాగుతున్న రాజధాని ప్రాంత రైతుల పోరాటం... నిర్విరామంగా నాలుగేళ్లుగా పోరు బాటు

మూడు రాజధానుల పేరిట వైసీపీ సర్కార్‌ తెరలేపిన నాటకానికి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ దమన నీతిపై భగ్గుమన్న రాజధాని ప్రాంత రైతులు ఆ మరుసటి రోజే ఉద్యమబావుటా ఎగురవేశారు. నాటి నుంచి నేటి వరకు అమరావతి అంతమే లక్ష్యంగా ప్రభుత్వం రాజధానిపై విషం కక్కుతోంది. సర్కార్‌ అణచివేతలు, నిర్బంధాలు, కిరాతకాలను... అన్నదాతలు పోరాట స్ఫూర్తితో అధిగమించారు. అక్రమ కేసులు, అరెస్టులను తట్టుకుని ఒక్కరోజూ విరామం లేకుంటా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2019 డిసెంబరు 17న శాసనసభ సాక్షిగా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేయటంతో పాటు దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నప్పుడు రాష్ట్రానికి ఉంటే తప్పేంటన్న వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజధాని అమరావతికి మద్దతిచ్చి, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నా రాజధానిని ఎక్కడికీ మార్చబోమని ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు. అధికారం చేపట్టిన అనతికాలంలోనే మాట తప్పి... మడమతిప్పి తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు.


ముఖ్యమంత్రి నమ్మకద్రోహాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు పిడికిలి బిగించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. వివిధ ప్రజాసంఘాలు, మేధావులు, వివిధ రంగాల్లోని నిపుణులు, దేశవిదేశాల్లోని ప్రవాసాంధ్రులు వారికి మద్దతుగా నిలిచారు. మూడు రాజధానుల నిర్ణయంతో మనస్తాపం చెంది 247 మంది రైతులు, రైతు కూలీలు అశువులు బాశారు. పోలీసుల లాఠీదెబ్బల్ని, హింసాకాండను తట్టుకుని, మహిళలు ముందువరుసలో ఉండి అమరావతి ఉద్యమాన్ని నడిపించారు. ఇలా ఉద్యమజెండా దించకుండా రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు చేస్తున్న అమరావతి పరిరక్షణ పోరాటం నాలుగేళ్లకు చేరింది. ఈ క్రమంలో సుమారు 3 వేల మంది రైతులు, మహిళలు, రైతు కూలీలు, ఉద్యమకారులపై 720కి పైగా కేసులు నమోదయ్యాయి. అయినా వారు వెరువకుండా ప్రభుత్వ అణచివేతకు, పోలీసుల దమనకాండకు ఎదురొడ్డి నిలిచారు.


ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే క్రమంలో 2020 జనవరి 7న చినకాకాని వద్ద జాతీయ రహదారిని అన్నదాతలు దిగ్బంధించారు. దీంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు వైసీపీ సర్కార్‌ దుర్మార్గమైన చర్యలకు ఒడిగట్టింది. 144 సెక్షన్, సెక్షన్ 30 వంటివి ప్రయోగించింది. రాజధాని వీధుల్లో పోలీసు కవాతులతో ఉద్రిక్త వాతావరణం సృష్టించింది. పోలీసులు అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా రాజధాని ప్రాంతంలోని రైతుల ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. 2020 జనవరి 10న విజయవాడ కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి, గోడు వెళ్లబోసుకునేందుకు వెళుతున్న రాజధాని మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. హైకోర్టు జోక్యం చేసుకుని తీవ్రంగా మందలించడంతో పోలీసుల ఉక్కు పిడికిలిని ప్రభుత్వం కొంత సడలించింది. 2020 జనవరి 20న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రైతులు. శాసనసభ సమీపానికి చేరుకోవడంతో పోలీసులు వారిపై లాఠీలు ఝుళిపించారు. ఇలా ఉద్యమాన్ని అణగదొక్కేందుకు, రైతుల గొంతు నొక్కేందుకు జగన్ ప్రభుత్వం చేయని దాష్టీకం లేదు. నాలుగేళ్లపాటు ప్రభుత్వ దమనకాండను తట్టుకుని, సంయమనం కోల్పోకుండా, హింసకు తావివ్వకుండా రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు.

Tags

Read MoreRead Less
Next Story