LOKESH: వేదికపైనే లోకేశ్ కంటతడి

LOKESH: వేదికపైనే లోకేశ్ కంటతడి
చంద్రబాబును తలుచుకుని లోకేశ్‌ భావోద్వేగం... జనంలోకి భువనేశ్వరి, లోకేశ్‌

ప్రజల కోసం పోరాడిన నాయకుడు చంద్రబాబు అంటూ సమావేశ వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. తెలుగుదేశం-జనసేన పోరాడకుంటే రాష్ట్రాన్ని జగన్ ముక్కలు చేసి అమ్మేసేవాడని మండిపడ్డారు. తెలుగుదేశం-జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయమని స్పష్టం చేశారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బే సంపాదించాలని చంద్రబాబు భావిస్తే రాజకీయాలు అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నారా లోకేశ్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్నినవంబ ర్ ఒకటి నుంచి చంద్రబాబు నిలుపుదల చేసిన చోటు నుంచే తాను పునరుద్ధరించనున్నట్లు లోకేశ్‌ ప్రకటించారు. తెలుగుదేశం శ్రేణులన్నీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లు అక్రమంగా తొలగించారని తెలిపారు. ఓటర్ లిస్ట్ వచ్చిన వెంటనేప్ర తి ఇంటికి వెళ్లి ఓట్లు ఉన్నాయో లేదో తనిఖీ చేసి సరి చేయించాలని నిర్దేశించారు. సమావేశంలో లోకేశ్‌ ప్రసంగం గద్గద స్వరంతో సాగింది. చంద్రబాబు విషయంలో వైకాపా సర్కారు తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ విషయంలో..వైసీపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని లోకేశ్‌ ఆక్షేపించారు.జగన్ ఇంట్లో ఏం జరుగుతుందో తాము నోరు విప్పితే తల ఎత్తుకోలేరని హెచ్చరించారు. కానీ వ్యక్తిగత విమర్శలు వద్దని చంద్రబాబు తమకు చెప్పారన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలు పంపడమే కాకుండా తమ కుటుంబ సభ్యులపైనా.... వైకాపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేసినా ప్రజల హృదయాల్లో ఆయన స్థానం తొలగించలేరని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. నిజం గెలవాలి పేరిట ఈ నెల 25 నుంచి నారా భువనేశ్వరి యాత్ర చేపడతారని లోకేశ్‌ వెల్లడించారు. ఈ నెల 24న తిరుమల శ్రీవారిని దర్శించుకుని నారా వారిపల్లికి వెళ్తారని తెలిపారు. 25న చంద్రగిరి నియోజకవర్గం నుంచియాత్ర ప్రారంభిస్తారని, చంద్రబాబు అరెస్టు వార్త విని ఆవేదనతో చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తారని వివరించారు.

ఇతర రాష్ట్రాల రాజధానులకు దీటుగా మన రాజధాని ఉండాలని అహర్నిశలు కష్టపడినందుకు చంద్రబాబును బంధించారని లోకేశ్‌ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరడం తప్పా? ఇసుక దోపిడీ, కల్తీ మద్యంపై మాట్లాడడం.. కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు తగ్గించాలని అడగడమే ఆయన చేసిన నేరమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story