RK: వైసీపీపై ఆర్కే సంచలన ఆరోపణలు

RK: వైసీపీపై ఆర్కే సంచలన  ఆరోపణలు
పొమ్మనలేకే పొగబెట్టారు.. వైఎస్‌ షర్మిలతోనే తన ప్రయాణమన్న ఆర్కే

సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని అభివృద్ధిని గాలికి వదిలేస్తే వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిలదీశారు. మంగళగిరికి 1200 కోట్లు కేటాయించామని ఆర్భాటంగా ప్రకటించిన సీఎం జగన్ చివరికి 120 కోట్లకు కుదించారన్నారు. జగన్ మాటలు నమ్మి సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపడితే ఇప్పటికీ ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. అభివృద్ధి పనులు చేయకుండా మళ్లీ మంగళగిరి ప్రజలను ఓట్లు అడగలేకే వైసీపీకి, ఎమ్మెల్యేకు రాజీనామా చేశామన్నారు. షర్మిల వెంటే నడుస్తామని తెలిపిన ఆర్కే....చంద్రబాబుపై కేసులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

లోకేశ్‌ని ఓడించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా అని వైసీపీపై ధ్వజమెత్తారు. పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెట్టారని చెప్పారు. మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ధి చేశానన్నారు. తన నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. తన సొంత డబ్బుతో కొన్ని పనులు చేశానన్నారు. అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నించారు. సీఎం జగన్ తప్పులు చేస్తే కేసులు వేస్తానని హెచ్చరించారు. నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేశానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.


తాను ఏ పార్టీలో ఉంటాననేది కాలమే నిర్ణయిస్తుందన్న ఆర్కే.. వైసీపీకి తాను ఎంత సేవ చేశానో తనకే తెలుసన్నారు. "నేను సర్వస్వం పోగొట్టుకున్నాను. ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా. వైకాపాకు సిద్ధాంతాలు ఉండాలి. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.120 కోట్లను మాత్రమే కేటాయించారు. నా సొంత డబ్బుతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేశా. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించా. స్వయంగా నేనే రూ.8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చాను" అని ఆర్కే భావోద్వేగానికి గురయ్యారు.

"చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తా. వైకాపా ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడను. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయస్థానాలు తేలుస్తాయి. నేను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదు. నాకు జగన్ టికెట్ ఇవ్వలేదని నేను పార్టీని వీడలేదు. పొమ్మన లేక పొగపెట్టారు. నాకు, చిరంజీవికి, జగన్‌కు మధ్య ఏమి జరిగిందనేది మా అందరికీ తెలుసు’’అని ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story