YSRCP: దక్షిణ కోస్తాలో వైకాపాకు భారీ షాక్‌

YSRCP: దక్షిణ కోస్తాలో వైకాపాకు భారీ షాక్‌
పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీతో పలువురు నేతల సంప్రదింపులు

అధికార పార్టీకి ఆయువు పట్టైన దక్షిణ కోస్తాలో వైకాపాకు భారీ షాక్‌ తగిలింది..గత ఎన్నికల్లో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసిన జిల్లాల్లో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన అధికారపార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. వైకాపా అగ్రనాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు..తెలుగుదేశంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వివాదరహితులు, విజయావకాశాలు ఉన్న నాయకులను చేర్చుకునేందుకు తెలుగుదేశం నాయకత్వం సైతం మొగ్గు చూపుతోంది. కీలకమైన ఐదారుగురు నేతలు తెలుగుదేశంలో చేరడం దాదాపు ఖాయమైంది.

వైకాపా బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు MLAలు, మరో కీలక నేత తెలుగుదేశం తలుపు తట్టారు. జిల్లాపై పట్టున్న మాజీమంత్రి...కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై రగిలిపోతున్నారు. ఇప్పటికే మూడుసార్లు గెలిచిన సిటింగ్ స్థానం నుంచి మరోచోటకు మారాలని జగన్‌ సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సిటింగ్ స్థానం నుంచే పోటీలో ఉంటానని అధిష్టానానికి తెగేసి చెప్పినా..తన అభిమతాన్ని పార్టీ గౌరవిస్తుందన్న నమ్మకం లేదు. దీంతో ఆయన తెలుగుదేశంలో చేరాలని చూస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం ఒంగోలు లోక్‌సభ సీటుతోపాటు 4 అసెంబ్లీ స్థానాలు సూచించింది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానమే కావాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాకే చెందిన వైకాపా MLAశుక్రవారం జగన్‌ను కలవగా..ఆయన్ను ఒంగోలుకు మారాల్సిందిగా సూచించారు. తన సిటింగ్‌ స్థానాన్నే కేటాయించాలని ఆయన పట్టుబట్టారు. లేని పక్షంలో ఒంగోలు లోక్‌సభ సీటు ఇవ్వాలని కోరారు. దీనికి హామీ లభించకపోవడంతో...ఆయన కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఒంగోలు లోక్‌సభ సీటు ఇస్తామని తెలుగుదేశం హామీ ఇవ్వగా.. తన సిటింగ్ స్థానామే కావాలని ఆయన సూచించినట్లు తెలిసింది.

వైకాపా హయాంలో వ్యాపారపరంగా తీవ్ర ఇబ్బందులుపడిన ఓ MP తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అర్థబలానికి కొదవలేని ఆయన్ను ఎక్కడ సర్దుబాటు చేయాలోనని తెలుగుదేశం పరిశీలిస్తోంది. ఆయన టిక్కెట్‌ ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి చేరికపై ఆధారపడి ఉంది. కృష్ణా జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన వైకాపా సీనియర్ నేత జగన్‌ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అంగ, అర్థబలాలు పుష్కలంగా ఉన్న ఈ నేత తెలుగుదేశంతో సంప్రదింపులు జరపగా...ఆయన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న నూజివీడు నుంచి బరిలోకి దించే అంశాన్ని పరిశీలిస్తోంది.

రాజ్యసభ ఎంపీగా త్వరలోనే పదవీ విరమణ చేయనున్న దక్షిణ కోస్తాకు చెందిన వైకాపా కీలక నేత తెలుగుదేశంతో టచ్‌లో ఉన్నారు. ఆయన పార్టీలో చేరడం ఖాయమైతే నెల్లూరు లోక్ సభ స్థానంనుంచి బరిలోకి దించే అవకాశముంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీని మరో స్థానానికి మారాలని వైకాపా అధినాయకత్వం సూచించింది. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట స్థానమే ఇస్తామని హామీ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story