LOKESH: జగన్‌ పాలనలో దళితులపై కనీవినీ ఎరుగని దాడులు

LOKESH: జగన్‌ పాలనలో దళితులపై కనీవినీ ఎరుగని దాడులు
లోకేశ్‌ను పట్టుకుని బోరుమన్న దళిత బాధితులు... ఆదుకుంటానని హామీనిచ్చిన లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలు రాక్షసులకంటే క్రూరంగా తమను వేధించి చంపుతున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలో దళిత గళం పేరిట నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్న బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారిని ఓదార్చిన లోకేశ్‌ జగన్ పాలనలో 6వేల మందిపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి కారకులను అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ రద్దు చేసిన పథకాలను 100 రోజుల్లో పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దళితులపై దాడులు పెరిగిపోయాయని గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదని లోకేష్ ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో 215 వ రోజు యువగళం పాదయాత్ర నిర్వహించిన లోకేశ్ యు.కొత్తపల్లి మండలం శీలంవారిపాకలలో దళిత గళం పేరిట ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత నాయకుడు మహాసేన రాజేష్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సభలో ప్రజల సమస్యలకు లోకేశ్ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.


దళిత గళం కార్యక్రమానికి హాజరైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు లోకేష్‌ ఎదుట తమ బాధను వ్యక్తం చేశారు. వారిని ఓదార్చిన లోకేష్‌ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కోడికత్తి కేసులో ఆరేళ్లుగా శ్రీనివాస్‌ను బయటకు రానీయకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని అతడి కుటుంబసభ్యులు లోకేష్‌ ఎదుట వాపోయారు. శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్‌ అండగా ఉంటానన్నారు. సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రద్దు చేసి దళితుల ఉసురు తీసిందని లోకేష్‌ మండిపడ్డారు. మాస్కు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను చంపేశారని ..చీరాలలో మాస్కు పెట్టుకోలేదని కిరణ్ ను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో మహిళ దుస్తులు మార్చుకుంటుంటే వీడియోలు తీసి బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో రమ్యను, సీఎం సొంత జిల్లాలో నాగమ్మను హత్యచేస్తే నేటికీ చర్యలు లేవన్నారు. తెలుగుదేశం- జనసేన కలిసి అధికారంలోకి రాగానే ఇందుకు కారకులైన వారందరినీ శిక్షిస్తామంటూ బాధితులకు లోకేష్‌ భరోసా ఇచ్చారు.


తాను ఎప్పుడైనా మిమ్మల్ని కలిశానా అని లోకేశ్‌ అడిగిన ప్రశ్నకు ఇదే మొదటిసారని కోడికత్తి శ్రీను కుటుంబీకులు తెలిపారు. ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా చూశామని, బాబాయ్‌ గుండెపోటు డ్రామా చూశామని.. దాడిచేసింది వారని.. నింద తమపై వేశారని లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వాయిదాలకు వెళ్లరని, విచారణకూ సహకరించరని, దళిత యువకుడిని అయిదేళ్లుగా జైలులో పెట్టారని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల జగన్‌ పాలనలో ఆరు వేల మంది దళితులపై దాడులు జరిగాయని.. మరోసారి గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story