SAD: వైసీపీ సభలో తొక్కిసలాటలో ఒకరి మృతి

SAD: వైసీపీ సభలో తొక్కిసలాటలో ఒకరి మృతి
బస్సు కిందపడి మరొకరి కన్నుమూత.... ఏఎస్సైకు గుండెపోటు

మేదరమెట్ల వైసీపీ సిద్ధం సభలో అపశృతి చోటుచేసుకుంది. సభ ముగించుకొని తిరుగు ప్రయాణంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా... మరొకరు సృహ తప్పి పడిపోయారు. సృహ కొల్పోయిన వ్యక్తిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుడు ఒంగోలు పురపాలక సంఘంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మురళిగా గుర్తించారు. ఈ సభకు వెళ్లి వస్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మలుపు వద్ద బస్సులో నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గగా గుర్తించారు. సభకు హాజరై తిరిగి వస్తుండగా బస్సు ముందు డోర్‌ వద్ద నిల్చొని ఉన్న బాలదుర్గ.. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సభలో ఓ ఏఎస్సైకి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. "సిద్ధం" సభకు పిలిచినా రాలేదంటూ.. తనపై దాడి చేశారంటూ..జె.పంగులూరు మండలం రామకూరుకు చెందిన తలారి ధనచక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధం సభకు రమ్మని కొందరు వైకాపా నేతలు పిలిచారని... ధన చక్రవర్తి తెలిపారు. మిర్చి పంట కోసేందుకు కూలీలు వచ్చారని, సభకు రావడం కుదరదని చెప్పగా కొందరు వైసీపీ నేతలు తనను కులం పేరుతో దూషిస్తూ కర్రలు, రాడ్లతో విచక్షణరహితంగా కొట్టారని తెలిపారు. కుటుంబసభ్యులు తనను అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అక్కడ....... ప్రాథమిక చికిత్స తర్వాత ఒంగోలు రిమ్స్ కు వచ్చినట్టు వివరించారు.


ఈ సభలో తెలుగుదేశం-జనసేన బీజేపీ పొత్తుపై...... ముఖ్యమంత్రి జగన్ అక్కసు వెళ్లగక్కారు. వైసీపీతో నేరుగా తలపడే ధైర్యం లేకనే అరడజను పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని ఆక్షేపించారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో.... వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను వల్లెవేస్తూనే ప్రతిపక్షాలను లక్ష్యం చేసుకుని ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన మేలు ఏమీలేక ప్రతిపక్షాలు తనపై, తన పార్టీపై విమర్శలు చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. జగన్ కు ప్రజల్లో బలం లేదని, జగన్ ఓటమి ఖాయమని చెబుతున్న చంద్రబాబు అన్ని పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని జగన్ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story