AP: చేనేత కుటుంబానికి అండగా విపక్షాలు

AP: చేనేత కుటుంబానికి అండగా విపక్షాలు
ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పిన లోకేశ్‌... పరామర్శించిన నేతలు

వైసీపీ భూదాహానికి Y.S.R జిల్లాలో చేనేత కుటుంబం బలైపోయిందని విపక్ష నేతలు ఆరోపించారు. మాధవరంలో చేనేత కుటుంబం ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం సొంత జిల్లాలో వేలాది ఎకరాలను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని..... తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కొత్తమాధవరంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు పరామర్శించారు. సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యతో లోకేష్‌ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యపై దర్యాప్తు చేయిస్తామని తెలుగుదేశం నేతలు ప్రకటించారు.


ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ దాష్టీకానికి చేనేత కుటుంబం బలి కావడం, పెత్తందారీ పాలనకు నిదర్శనమని... కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. చట్టబద్ధ పాలనకు పాతరేసి, అరాచకం పెచ్చరిల్లుతుంటే... మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ఈ పాలకులను కొనసాగిస్తే ఎంత ప్రమాదమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సుబ్బారావు కుమార్తెను పరామర్శించిన సంజీవ్‌... కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైసీపీ నాయకుల భూదాహంతో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ తెలుగుదేశం చేనేత విభాగ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని మృతుడి కుటుంబ సభ్యులకు చెందేలా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు తప్పుడు పత్రాలు సృష్టించి పేదల భూములు ఆక్రమించుకుంటున్నారని వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేతలు, రెవెన్యూ అధికారులపై... క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ.. కడప ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుబ్బారావు కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.

చేనేత కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై 24గంటల్లోగా పోలీసులు చర్యలు తీసుకోవాలని... తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న డిమాండ్‌ చేశారు. లేదంటే డీజీపీ రాజేంద్రనా‌థ్‌రెడ్డిని విధుల నుంచి తప్పించాలని ఈసీకీ లేఖ రాస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story