Andhra Pradesh News : పెన్షన్ కోసం పోతున్న ప్రాణాలు

Andhra Pradesh News : పెన్షన్ కోసం పోతున్న ప్రాణాలు
దిద్దుబాటు చర్యలు ఏవి?

ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీలో CSతో పాటు అధికార యంత్రాంగం తప్పుడు నిర్ణయాలకు 32 మంది మరణించారు. అయినా అధికారులు కళ్లు తెరిచినట్లు కనబడటం లేదు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని..మే నెలకు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏప్రిల్‌ మొదటి వారంతో పోలిస్తే ఎండలు ఠారెత్తిస్తున్నాయి.మే మొదటి వారానికి 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎండలు, వేడిగాలులకు యువకులే బయటకురావాలంటే హడలిపోతున్నారు. ఇంత ఎండల్లో పండుటాకులను రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లి సచివాలయాల వద్ద పింఛన్లు తీసుకోమంటే వారి పరిస్థితేంటని...సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ సాధ్యమేనని మెజారిటీ జిల్లా కలెక్టర్లు చెబుతున్నప్పుడు మీకేంటి బాధ అని సీఎస్‌ని నిలదీస్తున్నారు.ఏప్రిల్‌లో 32 మంది మరణించినా వైఖరి మారదా అని అడుగుతున్నారు. మే నెల్లో కూడా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయరా? ఇదేనా మానవత్వం అని... ప్రజలు నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సీఎస్‌ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి నెపాన్ని విపక్షాల పైకి నెట్టేసి, వైకాపాకి మేలు చేయాలన్న తలంపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. యంత్రాంగం మొత్తాన్ని నడిపే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన జవహర్‌రెడ్డి సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సెర్స్‌ సీఈవో మురళీధర్‌రెడ్డిల ప్రభావంలోనే ఉండిపోతారా ? అందులో నుంచి బయటపడరా? వృద్ధుల్ని సచివాలయాలకు రప్పించాలన్న వారి ఆలోచనకే ఈసారీ వంత పాడతారా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

పింఛన్లు ఇంటింటికీ పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పలేదు. వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని మాత్రమే చెప్పింది. ఇప్పుడున్న వాలంటీర్లలో అత్యధికులు వైకాపా కార్యకర్తలేనన్నది బహిరంగ రహస్యం. వైకాపా కార్యక్రమాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్న ఉదాహరణలు కోకొల్లలు.ప్రభుత్వ పథకాల్ని వారిద్వారా పంపిణీచేస్తే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవన్న ఉద్దేశంతోనే.. వారిని దూరంగా పెట్టాలని ఈసీ చెప్పింది. ఈసీ ఆదేశాలు అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ నిలిపేయడమేంటి? అది EC ఆదేశాలకు వక్రభాష్యం చెప్పినట్టు కాదా? మండుటెండల్లో వృద్ధులు, దివ్యాంగులుఅభాగ్యులను సచివాలయాల వద్దకు రప్పించి, దానికి కారణం విపక్షాలే అనే భావన ప్రజల్లో కల్పించి తద్వారా అధికార పార్టీకి మేలు చేయాలన్న ఉద్దేశమే కనిపిస్తోందన్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎస్‌ పై ఉంది. అధికారుల నిర్ణయాన్ని ఆసరాగా చేసుకుని.. వైకాపా నాయకులు ఎలా పేట్రేగిపోయారో..., వృద్ధుల్ని ఎంతగా ఇబ్బందులు పెట్టారో చూసిన తర్వాతైనా వారి తీరు మారాలి కదా! ఎన్నికల సంఘమైనా జోక్యం చేసుకుని ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి కదా అన్న ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story