Pensioners Problems: పింఛనుదారులను ఇక్కట్ల పాల్జేసిన ప్రభుత్వం

మండే ఎండలో వృద్దుల పాట్లు

పింఛన్ల విషయంలో జగన్‌ అనుకున్నంత పని చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా అమలు చేశారు. లబ్ధిదారుల చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా దూరంగా ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. మండుటెండల్లో మలమలమాడిపోయేలా కుట్ర పన్నారు. కొందరి ప్రాణాలు కోల్పోయేలా చేశారు. ఈ పాపమంతా జగన్‌దే. ఇంతటి దారుణాలు సీఎం జగన్‌కు వత్తాసు పలికే సీఎస్‌ జవహర్‌రెడ్డికి కనిపించలేదా అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

జగన్‌ సర్కార్‌ తీరు వల్ల పింఛన్లు తీసుకొనేందుకు వృద్ధులు, లబ్ధిదారులు పడుతున్న కష్టాలు 46 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రత ఠారెత్తిస్తుంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదు. దీంతో గొంతు తడారిపోతూ వేదన చెందారు. బ్యాంకుల్లో కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేక గంటల తరబడి నిల్చోలేక నరకయాతన అనుభవించారు. కొన్ని చోట్ల బ్యాంకులు నిండిపోవడంతో తలుపులు మూసి వృద్ధుల్ని బయటే ఎండలో ఉంచారు. ఇలా ఒకటి, రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా పింఛనుదారుల్ని అష్టకష్టాలు పెట్టి వికృత ఆనందం పొందారు. 1.35 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి తేలికైన మార్గం ఉన్నా కాలదన్నారు.

గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు పింఛనుదారుల్ని రప్పించినా రెండు రోజుల్లోనే 90 శాతంపైగా పంపిణీ పూర్తవడంతో ఈ సారి సచివాలయాలకు, బ్యాంకులకు పదే పదే తిప్పించి మరిన్ని ఇక్కట్లకు గురిచేసేలా ఎత్తుగడ వేసి అమలు చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇబ్బందులు కలగకపోతాయా? దాన్ని టీడీపీ, మిత్రపక్షాలపై వేయకపోతామా? అని గోతికాడ నక్కల్లా ఎదురుచూసేలా గురువారం ఉదయం నుంచే వైఎస్సార్సీపీ సైన్యాన్ని రంగంలోకి దింపి బ్యాంకుల వద్ద మోహరింపజేశారు. కుటిల రాజకీయ క్రీడను నడిపించారు. పేటీఎం బ్యాచ్‌ను పెట్టి సామాజిక మాధ్యమాల్లోనూ తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని కొన్ని చోట్ల పింఛనుదారులే తిప్పికొట్టారు. ఇంటింటికీ పింఛన్లు అందించేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా? అని ఎదురుతిరిగారు. గత నెల మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించకుండా బ్యాంకుల వద్దకు రప్పించడమేంటని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story