Ongole: పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్సీ యువకుడు మృతి

Ongole: పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్సీ యువకుడు మృతి
ముందు జాగ్రత్తగా ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పోలీసుల వేధింపులతో మనస్తాపం చెందిన ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్సీ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నెల 6న వై.పాలెంలో పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురైన మోజేష్ పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని పోలీసులు మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఏ తప్పూ చేయకపోయినా... పోలీసులు తీవ్రంగా కొట్టడంతో పాటు తండ్రిని కూడా దుర్భాషలాడారని బాధిత యువకుడు ఆరోపించాడు. ఎస్సై, సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు తన ఆత్మహత్యకు కారణమని చెప్పాడు. మోజేష్ మృతి పట్ల.. ఎస్సీ సంఘాలు, కుటుంబసభ్యులు ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉండటంతో... పోలీసులు ముందస్తుగానే యర్రగొండపాలెంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధంలేని కేసులో తనను, తన తండ్రిని ఠాణాకు పిలిచి పోలీసులు వేధించడంతో మోజెస్ అనే యువకుడు వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్ వద్దే పెట్రోలు పోసుకొని నిప్పంటించుకోవడం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కలకలం రేపింది. యర్రగొండపాలెంలోని గాయత్రి థియేటర్‌ సమీపంలో నాగెపోగు నరసింహారావు కుటుంబం నివాసం ఉంటోంది. వారి కుమారుడు 19ఏళ్ల మోజేష్ దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. గత మంగళవారం ఉదయం మాచర్ల రోడ్డులోని రాళ్లవాగు వంతెన పక్కన కొందరు యువకులు గొడవపడ్డారు. పోలీసులు వెళ్లి,ఆ సమయంలో అక్కడున్న మోజేష్, సుభాని అనే యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. మోజేష్ తండ్రిని పిలిచి ఇష్టమొచ్చినట్లు దూషించారు. అదేరోజు రాత్రి వారిని ఇంటికి పంపించిన పోలీసులు బుధవారం మళ్లీ రమ్మని చెప్పారు. బుధవారం ఉదయం సైతం కొట్టి, తన తండ్రిని ఎస్సై, సీఐ ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడటంతో మోజేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. స్టేషన్ ఆవరణలోనే బుధవారం సాయంత్రం ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడంతో కేకలు వేస్తూ స్టేషన్ నుంచి బయటకొచ్చి ఎదురు వీధిలోని నీళ్ల డ్రమ్ములో పడ్డాడు. ఎస్సై రాజేష్, సిబ్బంది హుటాహుటిన అతణ్ని మార్కా పురం వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి స్థానిక సీఐ, ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కారణమని మోజెస్ తెలిపాడు. మోజేష్ శరీరం దాదాపు 50 శాతం కాలిపోయినట్లు మార్కాపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. అక్కడ్నుంచి మార్కాపురంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మెడికో లీగల్ కేసు కట్టకుండా వైద్యం చేయలేమని వారు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులతో రాజీకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అకారణంగా తమ బిడ్డను పోలీసులు కొట్టడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఇప్పుడు మొజేష్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.


Tags

Read MoreRead Less
Next Story