AP: అంగన్‌వాడీ మహిళలపై దాష్టీకం

AP: అంగన్‌వాడీ మహిళలపై దాష్టీకం
ఛలో విజయవాడపై ఉక్కుపాదం మోపిన పోలీసులు.... మహిళలు అని చూడకుండా దుశ్శాసన పర్వం...

సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్‌ మొండి వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అంగన్వాడీలు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అంగన్వాడీలు విజయవాడకు రాకుండా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అరెస్టులను లెక్కచేయకుండా అంగన్వాడీలు స్టేషన్ల వద్దే ఆందోళన కొనసాగించారు


రాష్ర్టవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్‌కు ఇచ్చేందుకు విజయవాడ తరలిరావాలని అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. చీరాల నుంచి విజయవాడకు బయలుదేరిన 9 మంది అంగన్వాడీలను బాపట్ల రైల్వేస్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నందిగామ, జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విజయవాడలో అంగన్వాడీలను అరెస్టు చేసిన పోలీసులు వారిని మచిలీపట్నం D.T.C. కార్యాలయానికి తరలించారు. ఆగ్రహించిన అంగన్వాడీలు... కార్యాలయంలోనే ఆందోళన కొనసాగించారు. అంగన్వాడీలకు మద్దతు తెలిపిన CPM నేత బాబురావును ముందస్తుగా అరెస్టు చేసి ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం స్టేషన్‌కు తరలించారు.


గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న 120 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి వాహనంలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను మోపిదేవి వద్ద పోలీసులు అడ్డుకుని అవనిగడ్డ స్టేషన్‌కు తరలించారు. చలో విజయవాడ చేపట్టిన అంగన్వాడీలను అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.


డిమాండ్లు పరిష్కరించాలని మైలవరం స్టేషన్‌ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు.


ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి విజయవాడకు బయలుదేరిన 60 మంది అంగన్వాడీలను అర్థరాత్రి 2 గంటల సమయంలో గుంటూరు బస్టాండ్‌లో అరెస్ట్ చేసి నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. విజయవాడకు అనుమతి లేదంటూ ఏలూరు జిల్లా కైకరం జాతీయ రహదారిపై అంగన్వాడీలను చేబ్రోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు చెందిన అంగన్వాడీలను పోలీసులు బలవంతంగా కైకలూరు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో నిర్బంధించారు. అదుపులోకి తీసుకున్న విషయం బయటకు తెలియకుండా శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి భక్తి పాటలను ప్రదర్శించారు.


చలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను దెందులూరు మండలం 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న వాహనాలను ఏలూరు ఫైర్ స్టేషన్ కూడలి వద్ద పలు రాజకీయపార్టీ నేతలు, ప్రజాసంఘాల నాయకులు అడ్డుకున్నారు. అనంతరం వారితో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story