Pithapuram: పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం ..

పవన్‌ను ఓడించేందుకే ?

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో సుమారు 80 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని... సెబ్, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. కళ్లు బైర్లు కమ్మే రీతిలో నిల్వ ఉన్న మద్యం బాక్సులను చూసి అధికారులు నివ్వెరబోయారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ను ఎలాగైనా ఓడించేందుకు... వైకాపా ఏ స్థాయిలో మద్యాన్ని ఇక్కడికి దింపుతోందో చెప్పేందుకు... తాజా ఉదంతమే నిదర్శనం. పిఠాపురం పట్టణంతోపాటు మండలంలో అక్రమ మద్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం అందుకున్న సెబ్ అధికారులు, పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. జగ్గయ్య చెరువుకు చెందిన వట్టూరి సతీష్ కుమార్ ఇంట్లో 250 బాక్సులు, సాలిపేటలోని అంబటి వీర వెంకట సత్యనారాయణ మూర్తి వద్ద 260, Y.S.R. గార్డెన్స్ కాలనీలోని ఓ ఇంట్లో 290 బాక్సులు, కుమారపురంలోని వేమగిర సువార్తమ్మ నివాసంలో 215 బార్సులు మొత్తం 10 వందల 15 బాక్సులు గుర్తించారు. ఒక్కో బాక్సులో 48 చొప్పున మొత్తంగా 48 వేల 720 మద్యం సీసాలు... ఒక్కొక్కటి 250 మిల్లీ లీటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పట్టుబడిన మద్యం పిఠాపురానికి చెందిన వైకాపా నేతల అనుచరుల ఇళ్లలోనే దొరికింది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అందజేసేందుకు వారు నిల్వచేశారు. Y.S.R. గార్డెన్స్‌లో మద్యం నిల్వ చేసిన ఇల్లు.... పట్టణ వైకాపా అధ్యక్షుడు బొజ్జా దొరబాబు సోదరుడు వీరబాబుది అని... స్థానికులు తెలిపారు. అధికారులు మాత్రం ఆ ఇల్లు ఎవరిదనేది ఇంకా గుర్తిస్తున్నామని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు.. అక్కడి వైకాపా నాయకులకు... స్థాయిని బట్టి... ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున... ఎన్నికల ఖర్చు కింద ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో 4 కోట్ల రూపాయల విలువైన మద్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పట్టుబడిన మద్యం వైకాపాకు చెందిన ఓ అగ్రనేత కంపెనీల్లో తయారైనట్లు తెలుస్తోంది. పంపిణీ చేసేందుకు తెచ్చిన ఈ మద్యం నాసిరకానికి చెందినదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ను ఓడించేందుకు పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీత, సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని... ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌ వర్మ ఆరోపించారు. నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో మద్యం నిల్వలు ఉన్నాయన్నారు. ఓటర్లకు డబ్బులు పంచేందుకు పెద్ద సంఖ్యలో నగదు పిఠాపురం చేరుతోందని ఆయన తెలిపారు. కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. అక్రమాలకు పాల్పడుతోన్న వైకాపా అభ్యర్థి వంగా గీతపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story