BABU CASE: చంద్రబాబు కేసులో రోహత్గీ వాదనలివి..

BABU CASE: చంద్రబాబు కేసులో రోహత్గీ వాదనలివి..
సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వ్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ సీఐడీ తనపై పెట్టిన కేసులు కొట్టేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా M త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహత్గీ తొలుత వాదనలు వినిపించారు. ఈ కేసులో పాత నేరాలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం 17A సెక్షన్‌ వర్తించదని, 17A సెక్షన్‌ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందని రోహత్గీ వాదించారు. 17A సెక్షన్‌ అవినీతిపరులకు.. రక్షణ ఛత్రం కాకూడదని చెప్పారు. స్కిల్‌ కేసు విచారణకు ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉందని, వందల కోట్లు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్‌ 482 CRPCకింద క్వాష్‌ చేయలేమని రోహత్గీ వివరించారు. ఈ దశలో ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష వేయవచ్చన్న ధర్మాసనం.... ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా? అని ప్రశ్నించింది.


ఇందుకు సమాధానమిచ్చిన రోహత్గీ.. ఈ వ్యవహారం.. అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించండి.... లేదంటే క్వాష్‌ చేయండని అన్నారు. ఈ జవాబుపై జోక్యం చేసుకున్న జస్టిస్‌ బోస్‌.. ప్రస్తుతం చర్చ అంతా... 17ఏ వర్తిస్తుందా.. లేదా అనేదే కదా?, కేసుల నమోదు, ఛార్జిషీట్‌, విచారణ అన్ని కేసుల్లో జరిగేదే కదా అని పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయపరిధి ఉంటుందని రోహత్గీ సమాధానం ఇచ్చారు. ఈ కేసులో GST, ఆదాయ పన్ను శాఖలు కూడా దర్యాప్తు జరుపుతున్నందున నేరం జరిగిందా లేదా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదైందా లేదా అన్నంత వరకే పరిమితం కావాలని ధర్మాసనాన్ని కోరారు. అవినీతి నిరోధక కేసులు సహా సాధారణ కేసులు కూడా పోలీసులే విచారిస్తారన్న రోహత్గీ, ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసు FIRను ఎలా క్వాష్‌ చేస్తారని అన్నారు.

ఈ దశలో జస్టిస్‌ బోస్‌ జోక్యం చేసుకుని..మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చిందని, చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైందని, ఈ పరిస్థితుల్లో పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇందుకు సమాధానమిచ్చిన రోహత్గీ ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్‌ ప్రకారమే కాకూడదన్నారు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని, 17A అనేది హైబ్రిడ్‌ సెక్షన్‌. అది అవినీతి పరులకు రక్షణ కాకూడదని తాను చెపుతున్నట్లు వివరించారు. అవినీతిపరులను కోర్టు ముందు నిలబెట్టడంలో 17A అవరోధం కాకూడదని కోరుతూ రోహత్గీ తన వాదనలను ముగించారు.

Tags

Read MoreRead Less
Next Story