BABU CASE: సమర్థంగా వాదనలు వినిపించిన హరీశ్‌ సాల్వే..

BABU CASE: సమర్థంగా వాదనలు వినిపించిన హరీశ్‌ సాల్వే..
17ఏ అనుమతులు తీసుకోలేదన్న హరీశ్‌ సాల్వే... సమీక్ష జరిగితే కేసు మొత్తం మూసే పరిస్థితి వస్తుందని వ్యాఖ్య

చంద్రబాబు కేసులు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించిన తర్వాత చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే వాదించారు. స్కిల్‌ కేసులో అనేక మంది అధికారులు ఉన్నారని, వారిని విచారించినట్లు చెప్పారని, ఏ ఒక్కరికి 17A నిబంధన కింద ముందస్తు అనుమతులు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసుపై న్యాయ సమీక్ష జరిగితే.. మొత్తం కేసు మూసేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఈ కేసులో అరెస్టు చేసే వరకు చంద్రబాబు పేరు FIRలో లేదని, అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత చేర్చారని తెలిపారు. 2016-17లోనే విచారణ జరిపామని చెపుతున్న జగన్‌ ప్రభుత్వం ఆ విచారణలో ఏమి తేలలేదని గమనించాలన్నారు. అప్పుడు ముగిసిన తర్వాత తిరిగి 2021లో మళ్ళీ విచారణ ప్రారంభించి ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతున్నారని సాల్వే చెప్పారు.


అవినీతిపరులకు రక్షణ కాకూడదు అన్న ప్రభుత్వం వాదన నిజమైతే రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు కూడా 17A తెచ్చారనే అంశాన్ని కూడా మరువరాదని సాల్వే వివరించారు. ఈ కేసులో 17A అనేది అతి ముఖ్యమైనదన్న సాల్వే ఈ కేసులో జిఎస్టి, ఐటి దర్యాప్తు జరుగుతుందని చెపుతున్నారని, ఈ ప్రాజక్టును అమలు చేయాల్సిన సంస్థ GST వ్యవహారాలతో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఎలా ఉంటుందని సాల్వే ప్రశ్నించారు. ప్రభుత్వం దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్టు, కౌంటర్‌ అఫిడవిట్లు... ఆరోపణలతో నిండి ఉన్నాయి తప్ప ఒక్కటైనా నిర్ధిష్ట ఆధారం లేదని తెలిపారు. అదే సందర్బంలో విపక్ష నేతను జైల్లో పెట్టి విచారించడం తమ హక్కు అన్నట్టు ప్రభుత్వం భావిస్తోందని సాల్వే కోర్టుకు తెలిపారు.

ఎన్నికలు సమీపిస్తున్నందున అరెస్టు చేసి ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడం కోసమే ప్రభుత్వం ఈ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని సాల్వే వివరించారు. ఒకసారి చట్ట సవరణ జరిగిన తర్వాత అంతకు ముందు నుంచే వర్తిస్తుందని 1964 నాటి రతన్‌లాల్, 2019 నాటి శాంతి కండక్టర్స్‌ కేసులను సాల్వే ప్రస్తావించారు. స్కిల్‌ కేసులో 17A అనేది అత్యంత కీలకమైనదన్న సాల్వే ఎన్నికల ముందు రాజకీయ కక్షసాధింపులకు అవకాశం ఉంటుందని దాన్ని నిరోధించేందుకే 17A ఉందని తెలిపారు.ఎలాంటి పరిస్థితుల్లో అయినా 17ఎ వర్తిస్తుందంటూ వాదనలు ముగించిన సాల్వే 73 ఏళ్ల వయసులో చంద్రబాబును 40 రోజులుగా జైల్లో పెట్టారని గుర్తుచేశారు. ఈ కేసులో వాదనలు పూర్తైనందున మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తిచేశారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం తరపున నిరంజన్‌ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ దశలో స్పందించిన జస్టిస్‌ బోస్‌ ప్రధాన పిటిషన్‌ పైనే వాదనలు విన్నామని, తీర్పునే వెలువరిస్తామని ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story