కడప యోగి వేమన యూనివర్సిటీ తీరుపై విద్యార్ధుల మండిపాటు

ఏపీలో ఉన్నత విద్యామండలి తీరుపై విద్యార్ధులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పదేళ్ల తర్వాత సొంత భవనాలను సమకూర్చుకోని కాలేజీకు అనుమతి ఇవ్వొద్దన్నది జీవో 29లో నిబంధన ఉన్నా.. అధికారులు పట్టించుకోలేదు. ఇష్టాను సారం తమకు నచ్చిన కాలేజీలకు అనుమతులు మంజూరు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఏపీలో జీవో నెంబర్ 29కి వ్యతిరేకంగా ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయం వివాదస్పదం అవుతోంది. జీవో 29 ప్రకారం పదేళ్లు దాటిన కళాశాలలకు గుర్తింపు పొడిగించే అధికారం ఉన్నత విద్యామండలికి లేదు. పదేళ్ల తర్వాత కూడా సొంత భవనాలను సమకూర్చుకోని కాలేజీకు అనుమతి ఇవ్వొద్దన్నది జీవో 29లో ఉంది.. కడప జిల్లాలోని సొంత భవనాలు లేని కాలేజీలకు అఫ్లియేషన్ ఇచ్చేది లేదని యోగి వేమన వర్సిటీ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇటీవలె తనిఖీలు చేపట్టి జిల్లాలోని ఆరు డిగ్రీ కాలేజీలకు అఫ్లియేషన్లు ఇవ్వొద్దని వేమన వర్శిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉన్నత విద్యామండలి మాత్రం యూజీసీతో పాటు జీవో 29 నిబంధనలనకు వ్యతిరేకంగా తాత్కాలిక అఫ్లియేషన్లు ఇస్తూ ఆదేశాలివ్వడం పెను దుమారం రేపుతోంది.

కడప జిల్లాలోని పది కాలేజీలు నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాత్కాలిక అనుమతులతో అఫిలియేషన్ పొందుతూ నెట్టుకొస్తున్నాయి. జమ్మలమడుగులో సాయి పరమేశ్వర డిగ్రీ కళాశాలతో పాటు, పొద్దుటూరు లోని వేదవ్యాస, డిగ్రీ కళాశాల లేపాక్షి డిగ్రీ కళాశాల, కడప లోనే వైష్ణవి డిగ్రీ కళాశాల, వికాస్, విద్యా సాధన బద్వేల్ లోని చైతన్య కళాశాలలకు అడ్మిషన్లు జరపరాదని యోగి వేమన యూనివర్శిటీ నోటీసులు జారీ చేసింది.

యోగి వేమన యూనివర్శిటీ నోటీసులను ఏ మాత్రం పట్టించుకోకుండా.. UGC నిబంధనలు ఉల్లంఘించారు ఉన్నత మండలి విద్యాధికారులు. జీవో 29 మంగళం పాడి.. 10 సంవత్సరాల తాత్కాలిక అఫిలియేషన్ ముగిసిన బోగస్ కళాశాలలకు అక్రమంగా తిరిగి అఫిలియేషన్ కట్టబెట్టారు. కాలేజీ యాజమన్యాలు ఇచ్చే కాసుల కోసం కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలేశారు. 10 సంవత్సరాల నియమ నిబంధనలతో కూడిన అనుమతులు ముగిసినా.. ఉన్నతాధికారుల తిరిగి అఫిలయేషన్‌ కట్టబెట్టారు. దీంతో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *